Last Updated:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాాజాగా వెల్లడించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు తాజాగా వెల్లడించారు. కొందరు వ్యక్తులు తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని, తన వృద్ధ తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తన తండ్రితో కలిసి వచ్చిన ఆయన, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వయంగా ఫిర్యాదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) లో అనంత శ్రీరామ్ తన తండ్రితో కలిసి ఫిర్యాదు సమర్పించారు. తమ కుటుంబానికి ఎదురవుతున్న ముప్పుపై కలెక్టర్‌తో పాటు జిల్లా ఎస్పీకి కూడా ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనంత శ్రీరామ్ స్వగ్రామమైన పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం దొడ్డిపట్లలో ఈ వివాదం నెలకొంది. ఆయన ఇంటి ముందున్న ఐదు సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ స్థలానికి సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయినప్పటికీ, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ తన అనుచరులతో కలిసి బెదిరింపులకు దిగుతున్నట్లు అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.
సూర్యప్రకాష్ అనుచరులైన డేగల సత్యనారాయణ (సత్తికొండ), చేగొండి నాగరాజు అనే వ్యక్తులు వివాదాస్పద స్థలంలోకి ఒక ఇసుక లారీ లోడ్‌ను తీసుకువచ్చారని ఆయన వివరించారు. అనంత శ్రీరామ్ కుటుంబ సభ్యులు దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వారు వినిపించుకోకుండా అందరికీ ఉమ్మడిగా ఉన్న దారిని పూర్తిగా మూసివేస్తూ ఇసుకను అక్కడే అక్రమంగా అన్‌లోడ్ చేసి వెళ్లిపోయారని తెలిపారు.
కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం అనంత శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు. తాము బయటికి బాగానే కనిపిస్తున్నప్పటికీ, కొందరు వ్యక్తులు చేస్తున్న పనుల వల్ల తీవ్రమైన మానసిక ఆందోళన అనుభవిస్తున్నామని చెప్పారు. ఈ స్థల వివాదం కారణంగా గ్రామంలో ఉంటున్న తన వృద్ధ తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏ సమయంలో ఎవరు ఏం చేస్తారో తెలియని భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్టాన్ని అతిక్రమించి, ఉమ్మడి దారిని ఇష్టారాజ్యంగా మూసివేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana












