Last Updated:
Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్‌లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
Motkur Municipality Controversy: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో రూ.15 కోట్ల నిధులపై పంచాయతి నెలకొంది. పనుల ఆమోదానికి మున్సిపల్ కౌన్సిల్‌లో పెట్టిన తీర్మానంపై కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పాటు అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో మాకు తెల్వకుండా పెట్టిన పనులకు ఆమోదం తెలిపేది లేదంటూ అధికార కాంగ్రెస్ ఐదుగురు కౌన్సిలర్లతో పాటు మరో ముగ్గురు బీఆరఎస్ కౌన్సిలర్లు మెజార్టీ 8 మంది సభ్యులు తీర్మానానికి వ్యతిరేకంగా చేతులు లేపి సంతకాలు చేశారు. తీర్మానం సంతకాలు పెట్టకుండా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సహా మరో ఇద్దరు కౌన్సిలర్లు సమావేశం నుంచి బయటకు వచ్చారు. వివరాల్లోకి వెళితే..
మోత్కూరు మున్సిపల్ బడ్జెట్ ఆమోదం కోసం సోమవారం మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్నసోమనర్సయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో బడ్జెట్‌తో పాటు ఇతర అంశాలపై మున్సిపల్ అధికారులు ఎజెండా తయారు చేసి పలు తీర్మానాల ఆమోదం కోసం పెట్టారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు ముందు అన్ని మున్సిపాలిటీలకు నిధులు మంజూరు చేయగా అందులో మోత్కూరు మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఎన్నికలకు ముందు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆ నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేశారు. ఆ రూ.15 కోట్ల నిధులతో చేపట్టే పనులకు ఎన్నికలకు ముందే టెండర్ పూర్తయ్యింది.
ఆ పనులను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు చెందిన అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ వినోద్ రెడ్డి (నాగార్జున కన్‌స్ట్రక్షన్స్) ఒక్కరే సింగిల్ టెండర్ వేసి దక్కించుకున్నారు. ఆ పనుల ఆమోదం కోసం కౌన్సిల్‌లో తీర్మానం పెట్టారు. కొత్తగా ఎన్నికైన అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమకు తెలియకుండా పెట్టిన పనులకు ఎలా ఆమోదం తెలుపుతామని, రూ.15 కోట్ల పనులకు సింగిల్ టెండర్ ఎలా వేస్తారని, ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే తమ వార్డుల్లో అభివృద్ధి చేయకుంటే ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఆమోదించాలని కొందరు, ఆమోదం తెలపమంటూ మరికొందరు పట్టుబట్టడం, అధికార కాంగ్రెస్ కౌన్సిలర్లే తీవ్రంగా వ్యతిరేకించడంతో సభ్యుల మధ్య వాగ్వివాదం నెలకొన్నట్టు తెలిసింది. దీంతో రెండు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ కౌన్సిలర్లు పనులను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని కొందరు..లేదు ఆ పనులకే ఆమోదం తెలపాలని మరికొందరు పట్టుబట్టి ఓటింగ్ పెట్టగా ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్మిళ్ల ప్రమీలరాములు, బీసు శ్రీకాంత్, కారుపోతుల వెంకన్న, మెంట రమణనగేష్, మొగుళ్ల అనురాధతో పాటు బీఆరఎస్ కౌన్సిలర్లు సుల్తాన్ స్వామి, కొండ శోభసోంమల్లు, నల్ల మధు మెజార్టీ 8 మంది సభ్యులు చేతులెత్తి సంతకాలు చేయగా, చైర్మన్ స్వప్నసోమనర్సయ్య, వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న, కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్యశ్రీనివాస్ రెడ్డి, గనగాని శైలజనర్సింహ సంతకాలు చేయకుండా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆదిలోనే అధికార కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య భేదాభిప్రాయాలు నెలకొనడంతో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్న చర్చకు దారితీసింది.సమావేశ తీర్మానం మేరకు టెండర్ రీకాల్ చేయాలన్న తీర్మానాన్ని కలెక్టర్ కు పంపుతామని అధికారులు తెలిపారు.తీర్మానం పై ఓటింగ్ జరగడం మున్సిపల్ చరిత్రలోనే ఇదే ప్రధమం. రూ.15 కోట్ల పనులను రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేయడంతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Yadagirigutta,Nalgonda,Telangana












