Last Updated:
ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించి, యువకుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
Mumbai: ముంబై నగరంలో అత్యంత రద్దీగా ఉండే లోకల్ రైలులో ఒక చిన్నపాటి వాగ్వాదం కాస్తా ఘోర హత్యకు దారితీసింది. రైలు తలుపులు తీయాలా, మూయాలా అనే స్వల్ప విషయమై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన గొడవ చివరకు ఒక యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. తోటి ప్రయాణికులు అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించి, యువకుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని అంధేరి – బోరీవలీ స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ సమయంలో బయట భారీ వర్షం కురుస్తోంది. రైలు ప్రయాణిస్తున్న క్రమంలో.. లోపలికి వర్షం పడకుండా ఉండేందుకు రైలు తలుపులు మూయాలని ఒకరు, లేదు తెరిచి ఉంచాలని మరొకరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రయాణికుడైన సచిన్ రమేశ్ సువర్ణ (30), మయాంక్ లోహర్ (22) అనే యువకుడి మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దదైంది.
దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సచిన్ రమేశ్ సువర్ణ.. ఒక్కసారిగా తన బ్యాగులో నుంచి పదునైన కత్తిని బయటకు తీశాడు. రైలు డబ్బాలో ఉన్న ప్రయాణికులందరూ తీవ్ర భయాందోళనలతో చూస్తుండగానే, మయాంక్ లోహర్ (22)పై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. మయాంక్ ఛాతిపై, పొట్టపై పలుమార్లు బలంగా పొడవటంతో, అతడు తీవ్ర రక్తస్రావమై రైలులోనే కుప్పకూలిపోయాడు.
రైలులో ఉన్న ప్రయాణికులను కత్తితో బెదిరిస్తూ వీరంగం సృష్టించిన నిందితుడు సచిన్ రమేశ్, రైలు బోరీవలీ స్టేషన్‌కు చేరుకుంటుండగా వేగాన్ని అందుకుని కిందికి దూకి చాకచక్యంగా పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మయాంక్‌ను తోటి ప్రయాణికులు, రైల్వే సిబ్బంది కలిసి వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు పరీక్షించి ధ్రువీకరించారు.
రైల్వే పరిధిలో జరిగిన ఈ ఘోర హత్యను ముంబై పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. బోరీవలీ స్టేషన్‌తో పాటు రైల్వే పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 400 సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు కూలంకషంగా పరిశీలించారు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా నిందితుడు సచిన్ రమేశ్ సువర్ణను గుర్తించి, కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. స్వల్ప కారణానికే తోటి ప్రయాణికుడిని ఇంత ఘోరంగా హతమార్చడంపై ప్రయాణికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













