PM Modi: ‘దేశ అభివృద్ధికి అసలైన ఇంధనం యువతే’.. ప్రధాని మోదీ | | ACTPnews

News18


Last Updated:

దేశ పురోగతిలో యువతదే కీలకపాత్ర అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఉత్పాదక రంగం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు అన్ని రంగాల్లోనూ వారి ప్రతిభ విశేషమైనదని కొనియాడారు. కర్ణాటకలోని మైసూర్‌లో నిర్మించిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రం’ (వివేక స్మారక) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

News18
News18

నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు అని, వారి సామర్థ్యమే దేశానికి అతిపెద్ద బలం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్‌లోని శ్రీ రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ‘స్వామి వివేకానంద సాంస్కృతిక యువ కేంద్రాన్ని (వివేక స్మారక)’ శనివారం ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి యువతే ప్రధాన చోదకశక్తిగా మారుతున్నారని ప్రశంసించారు. యువతకు సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం, ఆత్మవిశ్వాసం కల్పించినప్పుడు వారు ఎలాంటి అద్భుతాలనైనా సాధించగలరని ఆయన అన్నారు.

ఇందులో విద్యా సంస్థల పాత్ర చాలా కీలకమని ఆయన పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల విజయాల వెనుక భారతీయ యువత కృషీ ఎంతో ఉందని మోదీ కితాబిచ్చారు. ఈ వివేక స్మారక ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు శ్రీ రామకృష్ణ ఆశ్రమం నిర్వాహకులకు, పండితులకు ప్రధాని అభినందనలు తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మనదే!

ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ భారత యువత గ్లోబల్ వృద్ధికి కూడా తోడ్పడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. “ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి కారణం ఎవరు? భారతీయ యువత శక్తి, నైపుణ్యం, సామర్థ్యాలే” అని ఆయన స్పష్టం చేశారు.

నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా భారత్ అవతరించిందంటే, దానికి కారణం యువత ప్రతిభే అని ఆయన చెప్పారు. అంతరిక్ష రంగంలోనూ యువ భారతీయులు మరో మైలురాయిని చేరుకున్నారని, ఒక ప్రైవేట్ సంస్థ రూపొందించిన రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి చేరుకోవడం గర్వకారణమని ప్రధాని ప్రశంసించారు.

విద్య, క్రీడల మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి

విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా 14,000 కు పైగా ‘పీఎం శ్రీ’ (PM SHRI) పాఠశాలలను అభివృద్ధి చేశామని, వీటి ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యమని ఆయన వివరించారు. దీనికి తోడు 10,000 కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్య 823కి పెరిగిందని తెలిపారు.

ఒకవైపు విద్యా మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తూనే, మరోవైపు ఆధునిక కాలానికి అవసరమైన విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని మోదీ స్పష్టం చేశారు. అలాగే, ఖేలో ఇండియా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఆధునిక క్రీడా సదుపాయాలను విస్తరిస్తున్నామని, గ్రామాలు, చిన్న పట్టణాల నుంచి కొత్త ప్రతిభను వెలికితీస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

మైసూర్ సంస్కృతి, వారసత్వం అజరామరం

మైసూర్ నగరం భారతదేశ శాశ్వత సాంస్కృతిక చైతన్యానికి కేంద్రమని మోదీ అభివర్ణించారు. ఇక్కడి దేవాలయాలు, సంప్రదాయాలు, పండుగలు, మైసూర్ ప్యాలెస్, మైసూర్ దసరా వంటివి దేశ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని అన్నారు. రామకృష్ణ ఆశ్రమం, స్వామి వివేకానంద జ్ఞాపకాలు మైసూర్ గుర్తింపులో విడదీయరాని భాగమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీకి హెలిప్యాడ్ వద్ద కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఘనస్వాగతం పలికారు. వివేక స్మారకలో ప్రధాని కొద్దిసేపు ధ్యానం చేసి, వివేకానందుడికి సంబంధించిన అరుదైన ఫోటోలు, చారిత్రక పత్రాలను పరిశీలించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *