Last Updated:
PM Modi: వాతావరణ మార్పులపై పోరాటంలో అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య తలసరి ఉద్గారాల వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
చారిత్రకంగా అత్యధిక కర్బన ఉద్గారాలకు కారణమైన సంపన్న దేశాలే ఈ పర్యావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో అధిక బాధ్యత వహించాలని ఆయన తేల్చిచెప్పారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 17 దేశాల న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులతో నిర్వహించిన “పర్యావరణం, వాతావరణ డైనమిక్స్ భవిష్యత్తు” అంతర్జాతీయ సదస్సులో శనివారం ప్రధాని ప్రసంగించారు.
భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాలు ప్రపంచ సగటులో సగం మాత్రమే ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఆరు రెట్లు ఎక్కువగా ఉందని మోదీ గుర్తుచేశారు. ఉద్గారాల బాధ్యతను అభివృద్ధి చెందుతున్న దేశాలపైకి నెట్టడం సరికాదని, ఈ విషయాన్ని భారత్ ప్రతి అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపిస్తోందని పేర్కొన్నారు. ‘గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్’, ‘బిగ్ క్యాట్ అలయన్స్’ వంటి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాల్లో భారత్ చురుగ్గా పాల్గొంటూ తన నిబద్ధతను చాటుకుంటోందని తెలిపారు.
గత 12 ఏళ్లలో పర్యావరణ రంగంలో భారత్ విశేష పురోగతి సాధించిందని, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సారించామని ప్రధాని తెలిపారు.
పీఎం సూర్య ఘర్ యోజన: ఈ పథకం ద్వారా ఇప్పటికే 50 లక్షల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశామని, ఇది ప్రపంచంలోని అనేక దేశాల మొత్తం గృహాల సంఖ్య కంటే ఎక్కువని వెల్లడించారు. సౌరశక్తి ద్వారా ఏటా 200 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారిస్తున్నామని వివరించారు.
స్వచ్ఛ ఇంధనం, అణు విద్యుత్: సౌరశక్తితో పాటు ఇతర స్వచ్ఛ ఇంధన సామర్థ్యం గత 12 ఏళ్లలో మూడు రెట్లు పెరిగిందని, ఇప్పుడు అణుశక్తి విస్తరణపై దృష్టి సారించామని పేర్కొన్నారు. అయితే అణుశక్తి వైపు అడుగులు వేస్తుంటే కొందరు పర్యావరణం పేరుతో కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు.
హైడ్రోజన్ రైలు, బొగ్గు గ్యాసిఫికేషన్: భారతదేశపు తొలి మరియు ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలును ప్రారంభించామని, పరిశ్రమల్లో బొగ్గు గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈవీ, మెట్రో విస్తరణ: గత 12 ఏళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం 950 శాతానికి పైగా పెరిగిందని, గతేడాది ఏకంగా 25 లక్షల ఈవీలు అమ్ముడయ్యాయని చెప్పారు. గతంలో కేవలం 5 నగరాల్లో 250 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉన్న మెట్రో నెట్‌వర్క్, నేడు దేశవ్యాప్తంగా 1,000 కిలోమీటర్లకు పైగా విస్తరించిందని వెల్లడించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని, చెత్త నుంచి సంపద సృష్టించే ‘వేస్ట్ టు వెల్త్’ మోడల్‌పై పనిచేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ‘వన్ నేషన్, వన్ గ్రిడ్’ సాధించామని గుర్తుచేశారు. పారిస్ కాప్-21 (COP21) ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువు కంటే ముందే పూర్తి చేసిన ఏకైక జీ20 దేశం భారతదేశమేనని ప్రధాని గర్వంగా ప్రకటించారు.














