Last Updated:
Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Postal Ganja Smuggling: ఎవరికి అనుమానం రాకుండా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ కొల్లెంగోడ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణాను పోస్టు ద్వారా సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణా కేసులో ప్రధాన నిందితుడైన 19 ఏళ్ల యువకుడిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అంతే కాదు ఎక్సైజ్ అధికారులు రైడ్ చేయడానికి వచ్చిన సమయంలో వారిపై దాడికి ప్రయత్నించిన 20 భయంకరమైన పెంపుడు కుక్కలను బిస్కెట్లతో శాంతపరిచి, వాటి దృష్టిని మళ్లించిన తర్వాత నిందితుడ్ని అరెస్ట్ చేసింది ఎక్సైజ్ అధికారుల బృందం.
కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌లోని కొల్లెంగోడ్, త్రమణి సమీపంలోని తడనారకు చెందిన జిజిత్ అనే 19 యువకుడు కొల్లెంగోడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా 7.34 కిలోగ్రాముల గంజాయి రవాణాకు సంబంధించిన కేసులో ప్రధాన అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. చిత్తూరు ఎక్సైజ్ సర్కిల్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ నార్కోటిక్స్ స్పెషల్ స్క్వాడ్, కొల్లెంగోడ్ ఎక్సైజ్ రేంజ్ అధికారులతో కూడిన సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది.
విచారణ బృందం తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 4న మేఘాలయ నుండి కొల్లెంగోడ్ పోస్టాఫీసుకి జిజిత్ పేరుతో గంజాయితో ఉన్న పార్శిల్ పంపబడింది. అంతకుముందే ఈ కేసులో కొల్లెంగోడ్‌లోని తెక్కె పావడికి చెందిన ఆర్. సంజయ్ అనే 22 ఏళ్ల యువకుడితో పాటు అతని సోదరుడు ఆర్. రాహుల్ 26 సంవత్సరాలు కలిగిన ఇద్దరు సోదరులను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆ ప్రాంతానికి తిరిగి వచ్చాడన్న కేరళ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) రహస్య సమాచారం ఆధారంగా అధికారులు తెల్లవారుజామున కొల్లెంగోడ్ ,పాలక్కాడ్‌లలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
విచారణ బృందం అక్కడికి చేరుకున్నప్పుడు అధికారులు అనుమానితుడిని సమీపించకుండా అడ్డుకునేందుకు ఆయా ప్రదేశాల్లో ఉన్నవారు సుమారు 20 క్రూరమైన కుక్కలను వదిలారని సమాచారం. మొరుగుతూ తమ వైపు దూసుకొస్తున్న కుక్కలను ఎక్సైజ్ అధికారులు బిస్కెట్లు వేసి వాటిని శాంతపరిచారు. ఆ తర్వాత తమ ఆపరేషన్‌ను సులువుగా పూర్తి చేశారు. ఇంతలో పాలక్కాడ్‌లోని పుత్తూర్, వెల్లోలి లైన్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్న జిజిత్ ఎక్సైజ్ బృందాన్ని చూసి మేడ పైనుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే అధికారులు అతన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. మేఘాలయ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా గంజాయిని రప్పించేలా నిందితుడు జిజిత్ ఏర్పాట్లు చేశాడని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ సోదా కార్యకలాపాలకు ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఎన్. జి. అజయకుమార్ , పి. కె. మహమ్మద్ షఫీక్ నాయకత్వం వహించగా వీరితో పాటు ఇన్‌స్పెక్టర్లు కె. అభిలాష్, తన్జీల్ తహా, యు. కె. జితిన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్లు వి. మణి, ఆర్. సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.













