Last Updated:
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ కీటకం కాటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన కోల్కతాలో చికిత్స పొందుతుండగా, ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని AICWA తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
Prabhas Fauji Shoot: హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సందర్భంగా బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మ అస్వస్థతకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ సమయంలో కీటకం కాటు వేయడంతో ఆయనకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు సమాచారం. ప్రస్తుతం కోల్కతాలోని ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
పలు తెలుగు మీడియాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ముగిసిన అనంతరం రాజేష్ శర్మ అక్కడి సాంకేతిక నిపుణులతో మాట్లాడుతున్న సమయంలో తన కాలికి ఏదో కీటకం కుట్టినట్లు అనిపించింది. తొలుత దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. సాధారణ దోమ కాటు లేదా చిన్నపాటి సమస్యేనని భావించి చికిత్స కూడా తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అయితే దాదాపు ఆరు గంటల తర్వాత ఆయన కుడి కాలిలో తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. అనంతరం జ్వరం కూడా రావడంతో పరిస్థితి క్రమంగా విషమించింది. హైదరాబాద్ నుంచి కోల్కతాకు తిరిగి వెళ్లిన తర్వాత అసౌకర్యం మరింత పెరగడంతో సమీపంలోని ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్చి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం ఆయనను ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ స్నేహితురాలు, నటి సుదీపా చటర్జీ స్పందించారు. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని తెలిపారు. ఏ కీటకం కుట్టిందో ఇంకా స్పష్టత రాలేదని, వైద్యులు పలు పరీక్షలు నిర్వహిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆయన తల్లి వృద్ధురాలు కావడం, సోదరి విదేశాల్లో ఉండటంతో కుటుంబ సభ్యుల తరఫున తామే ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకుంటున్నామని వివరించారు.
మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం రాజేష్ శర్మకు ఉన్న శ్వాస సంబంధిత ఇబ్బందులు అదుపులోకి వచ్చాయని, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా స్థిరంగా ఉన్నాయని తెలుస్తోంది. అయినప్పటికీ వైద్యులు ఇంకా ఆయనను పూర్తిగా ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రకటించలేదు. ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ చికిత్స కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనపై ‘ఫౌజీ’ చిత్ర నిర్మాతలు స్పందిస్తూ, షూటింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదం లేదా వైద్య అత్యవసర పరిస్థితి జరిగినట్లు తమకు సమాచారం అందలేదని పేర్కొన్నట్లు సమాచారం. షూటింగ్ పూర్తయ్యాక జరిగిన పరిణామాలపై తాము పూర్తి వివరాలు సేకరిస్తున్నామని తెలుస్తోంది.
మరోవైపు ఈ ఘటనపై ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు సురేష్ శ్యామలాల్ గుప్తా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ, రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ ఘటనపై తక్షణమే ఉన్నతస్థాయి, పారదర్శక విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజేష్ శర్మకు వైద్య అత్యవసర పరిస్థితి ఎందుకు ఏర్పడింది? షూటింగ్ ప్రదేశంలో భద్రతా ప్రమాణాలు, పరిశుభ్రత, అత్యవసర వైద్య సదుపాయాలు సక్రమంగా అమలు చేశారా? నిర్మాణ సంస్థ లేదా ఇతర బాధ్యుల నుంచి ఏవైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా స్పందించారు. షూటింగ్ సమయంలో కీటకం కాటు కారణంగా తన స్నేహితుడు ఆస్పత్రిలో చేరడం బాధాకరమని పేర్కొంటూ, ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ప్రార్థించారు. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రాజేష్ శర్మ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














