Supreme Court: సుప్రీంకోర్టులో సంచలనం.. జడ్జిలపై పిటిషనర్ ఆగ్రహం.. పత్రాలు విసిరి దుర్భాషలు | | ACTPnews

News18


Last Updated:

న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పిటిషనర్ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తులను ఆదేశించే ప్రయత్నం చేశాడు. అనంతరం పత్రాలు విసిరి దుర్భాషలాడడంతో భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు. అయితే కోర్టు అతనిపై ధిక్కార చర్యలు తీసుకోకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. ఎందుకంటే?…..

News18
News18

న్యూఢిల్లీ, జూలై 10: సుప్రీంకోర్టులో శుక్రవారం (జూలై 10) విచారణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా తన కేసును వాదిస్తున్న ఓ పిటిషనర్ కోర్టు విచారణను అడ్డుకోవడంతో పాటు న్యాయమూర్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, పత్రాలను కోర్టు హాలులోకి విసరడం కలకలం రేపింది. ఈ ఘటన కొద్దిసేపు కోర్టులో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది.

అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్వయంగా హాజరైన పిటిషనర్ తన వాదనలు వినిపించే సమయంలో అసాధారణంగా ప్రవర్తించినట్లు సమాచారం.

విచారణ మధ్యలో పిటిషనర్, “లక్నో ఏసీపీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నేను కోర్టును ఆదేశిస్తున్నాను” అనే వ్యాఖ్యలు చేయడంతో ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనిపై జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ, “మీరు కోర్టును ఆదేశిస్తున్నారా? మమ్మల్ని ఆదేశిస్తున్నారా?” అని ప్రశ్నించారు.

దీనికి పిటిషనర్ స్పందిస్తూ, తన చెప్పాల్సిన విషయాలన్నీ ఇప్పటికే రికార్డులో ఉన్నాయని, ఇక చెప్పడానికి ఏమీ లేదని పేర్కొన్నారు. అనంతరం ఒక్కసారిగా తన వద్ద ఉన్న పత్రాలను గాల్లోకి విసిరేసి, భారత ప్రధాన న్యాయమూర్తిని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలంతో మాట్లాడినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రతా సిబ్బంది వెంటనే జోక్యం చేసుకుని పిటిషనర్‌ను కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో విచారణ కొద్దిసేపు అంతరాయం కలిగినా, అనంతరం ధర్మాసనం విచారణను కొనసాగించింది.

ఈ ఘటన జరిగినప్పటికీ పిటిషనర్‌పై కోర్టు ధిక్కార చర్యలు లేదా ఇతర శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని ధర్మాసనం నిర్ణయించింది. కేసు విషయాలను పరిశీలించిన అనంతరం, అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులో జోక్యం చేసుకునేలా సరైన కారణాలు కనిపించలేదని పేర్కొంటూ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేసింది.

విచారణ అనంతరం సీనియర్ న్యాయవాది పీఎస్ పట్వాలియా స్పందిస్తూ, “న్యాయమూర్తి బాధ్యతలు ఎంత కఠినమైనవో ఇలాంటి సందర్భాల్లో మరింత స్పష్టంగా తెలుస్తుంది” అని వ్యాఖ్యానించారు. దీనికి జస్టిస్ కేవీ విశ్వనాథన్ స్పందిస్తూ, ఆ పిటిషనర్ తీవ్ర మానసిక ఆవేదన, నిరాశలో ఉన్నట్లు కనిపించాడని చెప్పారు. అతనిపై తమకు కోపం లేదని, అతని పరిస్థితిపై కేవలం సానుభూతి మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ పరిణామం సుప్రీంకోర్టు విచారణల్లో అరుదుగా జరిగే సంఘటనగా చర్చనీయాంశమైంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed