Last Updated:
Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.
స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో…మరిచికోట్ చౌక్ సమీపంలో కూడా తొక్కిసలాట జరిగింది. భారీ జనసందోహం మధ్య నుంచి వెళ్తున్న ఒక అంబులెన్స్‌కు దారి ఇచ్చేందుకు భక్తులను పక్కకు జరిపే క్రమంలో కూడా మరోసారి తోపులాట జరిగింది. ఆ తీవ్రమైన రద్దీలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ది హిందూ కథనం ప్రకారం.. చికిత్స కోసం సుమారు వంద మంది భక్తులను ఆసుపత్రిలో చేర్పించగా వారిలో అత్యధికులు ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. అయితే, ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇక ఉదయం నుంచి రద్దీలో చిక్కుకున్న 33 మంది భక్తులను ఒడిశా ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రత్యేక రెస్క్యూ యూనిట్ (SRU) సురక్షితంగా రక్షించింది.
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి కార్యాలయం స్పందిస్తూ, ఇద్దరు వ్యక్తులు మరణించిన విషయాన్ని ధృవీకరించింది. అయితే ఇది శాంతిభద్రతల లోపం లేదా క్రౌడ్ మేనేజ్‌మెంట్ వైఫల్యం వల్ల జరిగిన తొక్కిసలాట కాదని స్పష్టం చేసింది. రథయాత్ర సందర్భంగా బడదండ వద్ద జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన తీవ్ర సంతాపం ప్రకటించారు.
అంతకుముందు గురువారం మధ్యాహ్నం భక్తుల జయజయధ్వనాలు, భక్తిశ్రద్ధల మధ్య ముగ్గురు దేవతామూర్తుల రథాల లాగడం ప్రారంభమైంది. బలభద్రుడి ‘తాళధ్వజం’, జగన్నాథుడి ‘నందిఘోష’, సుభద్ర దేవి ‘దర్పదలన’ రథాలు ముందుకు సాగాయి. స్వామివార్లను దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు పోటీ పడ్డారు. పూరీ రాజు దివ్యసింఘ దేవ్ సాంప్రదాయబద్ధంగా రథాలపై క్రతువును నిర్వహించారు. పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి కూడా రథాలపై ఉన్న దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














