Last Updated:
ఇరుముడి సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న రవితేజ.. ఇప్పుడు విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన జోరు చూపిస్తున్నారు. ఇటీవలే టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న రవితేజ, అదే రెట్టించిన ఉత్సాహంతో తన తదుపరి చిత్రాలపై దృష్టి సారించారు. ‘ఇరుముడి’ సినిమా రవితేజ కెరీర్‌కు సరికొత్త మైలేజ్ ఇవ్వడంతో పాటు, అభిమానులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించింది. ఈ ఘన విజయం ఇచ్చిన ఊపుతో ఇప్పుడు తన 78వ సినిమాను (RT 78) సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.
గత కొద్ది రోజులుగా రవితేజ తదుపరి చిత్రాన్ని విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ‘బ్రిడ్స్ ప్రొడక్షన్స్’ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా అధికారిక ప్రకటన చేసింది. ‘ఆర్టీ 78’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు లక్ష్మణ్, శ్రీనిరావు సంయుక్తంగా నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Okadu Horror Cinema antadu..
Inkokadu edo antadu..
Inkokadu vachi Inkedo antadu..
Inthaki title emayyuntundho – 11th October 10:30AM ki chuddamu 😉#RT78
M̶a̶s̶s̶ ̶M̶a̶h̶a̶r̶a̶j̶a̶ @RaviTeja_offl #VivekAthreya #Laxman #SriniRao @BridgeProdoffl https://t.co/AQQ7RGsaNs
— Bridge Productions (@BridgeProdoffl) October 9, 2026
దసరా కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ పంచుకోనున్నారు. అక్టోబరు 11న ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’, ఇటీవలే నానితో తీసిన యాక్షన్ బ్లాక్ బస్టర్ ‘సరిపోదా శనివారం’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు వివేక్ ఆత్రేయ. ఆయన మార్క్ స్టోరీ టెల్లింగ్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేకు రవితేజ అన్లిమిటెడ్ మాస్ ఎనర్జీ తోడైతే వెండితెరపై మ్యాజిక్ ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సగటు ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో విపరీతంగా నెలకొంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో రవితేజకు జోడీగా ఏ స్టార్ హీరోయిన్ నటించనున్నారు? సంగీత బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయి? ఇతర కీలక పాత్రల్లో ఏ నటీనటులు కనిపించనున్నారు? అనే వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.














