Last Updated:
ప్రస్తుత విద్యా విధానం, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు.
ప్రస్తుత విద్యా విధానం, ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదాలపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తనదైన శైలిలో స్పందించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కేవలం నీట్ లీకుల గురించే ఆందోళన చెందుతున్నారని, కానీ అసలైన ప్రమాదం ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (AI) రూపంలో విద్యా వ్యవస్థ పైకి ముంచుకొస్తుందని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
నీట్ పరీక్షల రద్దు, పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే విద్యా వ్యవస్థ గాయపడుతున్నట్లు అనిపిస్తుందని, కానీ రాబోయే రోజుల్లో ఏఐ (AI) ఈ వ్యవస్థ పీక కోసేస్తుందని వర్మ అభిప్రాయపడ్డారు. శతాబ్దాలుగా విద్యార్థుల మెదళ్లలోకి పుస్తకాల్లోని జ్ఞానాన్ని మందు బిళ్లల్లా బలవంతంగా రుద్దుతున్నారని, కానీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో సమాచారానికి కొరత లేదన్నారు. అబద్ధాలు, తప్పుడు ప్రచారాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఆ సమాచారాన్ని మింగేసి, స్వచ్ఛమైన సమాధానాలను మనిషి మెదడు కంటే వేగంగా బయటకు ఇస్తుందని ఆయన విశ్లేషించారు.
ప్రొఫెషనల్ కోర్సుల భవిష్యత్తు: ఇంజినీరింగ్, మెడిసిన్, లా, సీఏ (CA), ఎంబీఏ (MBA) వంటి ప్రొఫెషనల్ కోర్సుల కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్న యువత.. ఒక కసాయి ఖానాలోకి నడుచుకుంటూ వెళ్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
నిద్రపోని యంత్రాలు: విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వచ్చేసరికి వారి డిగ్రీలు కేవలం కాగితాలుగా మిగిలిపోతాయని, ఆ ఉద్యోగాలను ఏఐ అప్పటికే కబళించేస్తుందని అన్నారు. ఏఐ వ్యవస్థలకు జీతం అవసరం లేదని, అవి నిద్రపోవని, సెలవులు అడగవని, ఒక తప్పును మళ్లీ చేయవని వర్మ గుర్తుచేశారు.
ప్రస్తుత విద్యా వ్యవస్థను మంటల్లో కాలిపోతున్న ఇల్లుతో వర్మ పోల్చారు. “తరగతి గదులు, పవిత్రమైన సిలబస్‌లు, ప్రవేశ పరీక్షలు ఇవన్నీ కాలిపోతున్న ఇంట్లోని సామాన్ల లాంటివి. గోడలకు మంటలు వ్యాపిస్తుంటే, మనం కుర్చీలు ఎక్కడ వేయాలో చర్చించుకుంటున్నాం. మనం ఇప్పటికైనా నిద్రలేచి ఆ పొగ వాసన చూడాలి” అంటూ ప్రస్తుత పరిస్థితులపై చురకలు అంటించారు. ‘ఒకసారి కష్టపడి చదివితే జీవితాంతం సెటిల్ అయిపోవచ్చు’ అనే పాతకాలపు నమ్మకాన్ని ఏఐ వీధుల్లోకి లాక్కొచ్చి కాల్చి పారేసిందని స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రపంచ టెక్ పరిణామాలను గమనిస్తే వర్మ వ్యాఖ్యల్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉందనేది ఐటీ నిపుణుల మాట. అత్యాధునిక ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాక, ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల నియామకాలను భారీగా తగ్గించేశాయి. భవిష్యత్తులో ఒకే వ్యక్తి ఏఐ సాయంతో డాక్టర్, లాయర్, ఇంజినీర్, చార్టర్డ్ అకౌంటెంట్ చేసే పనులను ఏకకాలంలో, అత్యంత కచ్చితత్వంతో చేయగలడని వర్మ విశ్లేషించారు. బట్టీ పట్టి మార్కులు తెచ్చుకునే సామర్థ్యానికి కాలం చెల్లిపోయిందని, ఏఐ లాంటి టెక్నాలజీలను టూల్స్ గా వాడుకోవడం నేర్చుకున్న వారికే భవిష్యత్తు ఉంటుందని అన్నారు.
ప్రస్తుత రోజుల్లో ఏఐని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడమే ఏకైక విలువైన విద్య అని ఆయన తేల్చి చెప్పారు. పాత సిలబస్‌లు, ర్యాంకులు, మార్కుల చుట్టూ తిరిగే విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ వారిని ఏఐ అనే కసాయి ఖానాలోకి నెడుతున్నారని విమర్శించారు.
“ఏఐ అన్నింటినీ మారుస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న కాదు. మీరు దానిని శాసించే వ్యక్తిగా మారుతారా? లేదా దాని చేతిలో ఉద్యోగం పోగొట్టుకునే వ్యక్తిగా మిగిలిపోతారా? అనేది మాత్రమే తేల్చుకోవాలి. నేను మరోసారి వేడుకుంటున్నాను.. ఇప్పటికైనా మేల్కొనండి” అని రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్‌ను ముగించారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














