Last Updated:
శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మోకాలి నొప్పి తగ్గకపోవడంతో అతడిని విశ్రాంతి తీసుకోమని బీసీసీఐ సూచించింది. అతడి స్థానంలో జమ్మూ కాశ్మీర్ యువ పేసర్ ఆకిబ్ నబీ దార్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది.
శ్రీలంక పర్యటనకు వెళ్తున్న భారత క్రికెట్ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. త్వరలో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు స్టార్ పేసర్, ప్రపంచ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. మంగళవారం బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో బుమ్రాకు స్థానం కల్పించినప్పటికీ, అతడి ఎంపిక ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ముందుగానే చెప్పారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం బుమ్రా ఫిట్నెస్ పరీక్షలో పాస్ అయ్యాడని, శ్రీలంక సిరీస్‌లో ఆడతాడని వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం బుమ్రా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐకి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో (NCA) చేసిన వైద్య పరీక్షల్లో బుమ్రా ఎడమ మోకాలిలో ఇంకా కొంత నొప్పి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడితో రిస్క్ చేయడం ఇష్టం లేక పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోమని బీసీసీఐ సూచించింది.
“గతంలో ఆటగాళ్లు గాయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే బరిలోకి దిగి మళ్లీ గాయపడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. బుమ్రా లాంటి కీలక ఆటగాడి విషయంలో అలాంటి రిస్క్ తీసుకోలేము. అతడు పూర్తిగా కోలుకోవడమే మా లక్ష్యం. ఈ ఏడాది ఇంకా ఆసియా క్రీడలు, న్యూజిలాండ్ పర్యటనతో పాటు వచ్చే ఏడాది ప్రతిష్ఠాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కూడా ఉంది. అందుకే బుమ్రాను శ్రీలంక సిరీస్ నుంచి తప్పించాం” అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
బుమ్రా దూరం కావడంతో అతడి స్థానంలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్‌ను తీసుకునే యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో బుమ్రా రీప్లేస్‌మెంట్‌ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. ఆకిబ్ నబీ దార్ ఇప్పటివరకు ఏ ఫార్మాట్లోనూ భారత్ తరఫున ఆడలేదు. కానీ దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. 2025-26 రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా రంజీ టైటిల్ గెలవడంలో బారాముల్లాకు చెందిన ఈ పేసర్ కీలక పాత్ర పోషించాడు.
శ్రీలంక సిరీస్ కోసం సెలెక్టర్లు మొదట నలుగురు ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేశారు. అందులో బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రా లేకపోవడంతో సిరాజ్‌తో కలిసి ప్రసిద్ధ్ కృష్ణ పేస్ బాధ్యతలు పంచుకునే అవకాశం ఉంది.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana














