Last Updated:
Rozgar Mela: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కొత్తగా ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు 20వ ‘రోజ్‌గార్ మేళా’ ద్వారా నియామక పత్రాలు అందజేయనున్నారు.
మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ పత్రాలను పంపిణీ చేయడంతో పాటు, నూతన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో ఈ 20వ రోజ్‌గార్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ విడతలో ఎంపికైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ తదితర కీలక కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ధి ప్రస్థానంలో వారిని భాగస్వాములను చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న నిరంతర ప్రయత్నాల్లో భాగంగా రోజ్‌గార్ మేళా కార్యక్రమం కొనసాగుతోంది. తాజా 20వ విడతతో కలిపి, ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థల్లో మొత్తం 12.75 లక్షల మంది యువతకు నియామక పత్రాలు అందించినట్లవుతుంది. ఈ బృహత్తర కార్యక్రమం కొత్తగా నియమితులైన సిబ్బంది ప్రజాసేవలో పాలుపంచుకోవడానికి వేదిక కల్పించడంతో పాటు, ఉపాధి కల్పన, దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది.














