Ruchika Singh: దేశానికి క్షమాపణ చెప్పిన రుచికా సింగ్.. మోదీపై వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా? | | ACTPnews

Ruchika Singh: దేశానికి క్షమాపణ చెప్పిన రుచికా సింగ్.. మోదీపై వ్యాఖ్యల వివాదం ముగుస్తుందా? |


అసలు వివాదం ఏమిటి?

జులై 23న జంతర్ మంతర్ దగ్గర నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు, CJP అధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సమయంలో రుచికా సింగ్ అనే యువతి ప్రధాని మోదీపై అసభ్యకరమైన భాష వాడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీశాయనీ, ప్రజా శాంతిని భంగపరిచేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. ఘజియాబాద్‌కు చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ కంప్లైంట్ ఇవ్వడంతో.. జులై 29న నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే పోలీస్ స్టేషన్‌లో రుచికా సింగ్‌పై జీరో FIR నమోదు అయింది. ఈ FIR భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352 (ఉద్దేశపూర్వక అవమానం), 353(1) (ప్రజా శాంతి భంగం), 356(1) (నింద) కింద నమోదైంది. ఘటన ఢిల్లీలో జరిగినందున ఈ కేసు ఢిల్లీ పోలీసులకు బదిలీ అయ్యింది.

జులై 31 (శుక్రవారం) రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో సందేశం పోస్ట్ చేశారు. ఆయన “జంతర్ మంతర్‌లో నాపైనే కాదు, నా స్వర్గీయ తల్లిపై కూడా అభ్యంతరకర భాష వాడారు. ఇది సంస్కృతికే షాక్. ఇలాంటివి ఏ సమస్యనూ పరిష్కరించవు. ఈ మార్గం తప్పిన పిల్లలను మనం క్షమించి సరైన మార్గం చూపాలి” అని అన్నారు. ఆయన “నేను వారిని క్షమిస్తున్నాను. వారిని కోర్టులకు లాగడం లేదా శిక్షించడం సమస్యను పరిష్కరించదు. వారు మన పిల్లలే. నాలుకను పళ్లు కొరికినా పళ్లను పగలగొట్టము” అనే ఉపమానం వాడిన మోదీ.. సమాజాన్ని క్షమాపణ వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే రుచికా సింగ్ క్షమాపణ వీడియో వచ్చింది.

రుచికా సింగ్ ఎవరు?:

రుచికా సింగ్ నోయిడా/ఫరీదాబాద్ ప్రాంతానికి చెందినవారు. పోలీసు రిపోర్టుల ప్రకారం ఆమె ఒక సెలూన్‌లో పనిచేసేవారు. పొరుగువారి ప్రకారం ఆమె వయస్సు సుమారు 25 సంవత్సరాలు. ఆమె జనవరిలో.. నోయిడా సెక్టార్ 150లోని లోటస్ జింగ్ సొసైటీలో ఫ్లాట్ కొన్నారు. ఫరీదాబాద్‌లోని ఉంచా గావ్‌కు చెందినవారు. నోయిడాలోని ఒక సెలూన్‌లో నెయిల్ ఆర్ట్ నేర్చుకోవడానికి వెళ్లారు. అక్కడ ‘మెన్‌షిల్’ అనే మారుపేరుతో సైన్ ఇన్ చేసేవారనీ, ఆధార్ కార్డు సమర్పించకపోవడంతో జూన్ 9న ఆమెను సెలూన్ నుంచి తొలగించారని సెలూన్ యజమాని టి.పి. త్రిపాఠి ఇండియా టుడేకి చెప్పారు. క్షమాపణ వీడియోలో ఆమె తన వయస్సు 15 సంవత్సరాలని చెప్పారు. ఈ వయస్సు వ్యత్యాసం పోలీసు విచారణలో భాగంగా పరిశీలనలో ఉంది.

రుచికాపై విమర్శల వర్షం:

వైరల్ వీడియోలో ప్రధాని, ఆయన తల్లిపై వాడిన భాష దేశంలోని అనేక వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. రాజ్యాంగ పదవి గౌరవం, సామాజిక విలువలు ప్రశ్నార్థకమయ్యాయి. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు క్రిమినల్ చర్యలు తీసుకోవాలనీ, మరికొందరు, CJP ప్రతినిధులు సౌరవ్ దాస్ వంటివారు కేవలం సివిల్ పరువు నష్టం కేసు సరిపోతుందనీ, క్రిమినల్ కేసు స్వేచ్ఛా వ్యక్తీకరణను దెబ్బతీస్తుందని వాదించారు. ఆమె కుటుంబం ముందుగానే పోలీసులకు క్షమాపణ పత్రం సమర్పించింది.

తాజాగా రుచికా సింగ్ చేతులు జోడించి, తల వంచి క్షమాపణ వీడియో విడుదల చేశారు. “నేను స్నేహితురాలితో కన్నాట్ ప్లేస్‌కు వెళ్లాను. అక్కడ నిరసన జరుగుతోంది. చాలా మంది ప్రధానిపై అసభ్యకర భాష వాడుతున్నారు. వారి ప్రభావంతో నేను కూడా చెప్పాను. నాకు కేవలం 15 సంవత్సరాలు. నేను చేసింది క్షమించదగనిది. ఇది నా మొదటి, చివరి తప్పు. ఆ వీడియో నేను పోస్ట్ చేయలేదు. దేశం మొత్తానికీ క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా కళ్లు కూడా ఎత్తలేను. దయచేసి క్షమించండి” అని అన్నారు. ఐతే.. ఈ వీడియో నిజమైనదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రుచికా సింగ్, కుటుంబం ఘటన తర్వాత కనిపించకుండా ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఈ వివాదం సోషల్ మీడియా ప్రభావం, యువత భాషా వినియోగం, రాజకీయ నిరసనల్లో పరిమితులు, క్షమాపణ vs. చట్టపరమైన చర్యలపై దేశవ్యాప్త చర్చను రేకెత్తించింది. ప్రధాని మోదీ క్షమాపణ వైఖరి, రుచికా సింగ్ తన తప్పును అంగీకరించడం వల్ల ఈ వివాదం కొంత మేరకు సద్దుమణిగే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పోలీసు విచారణ పూర్తయ్యే వరకు అన్ని వివరాలు అధికారికంగా నిర్ధారించలేం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed