S Janaki: దిగ్గజ గాయని జానకి మరణంపై ప్రముఖుల సంతాపం | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

జానకి, చిరంజీవి


Last Updated:

ప్రముఖ గాయని ఎస్ జానకి శనివారం సాయంత్రం మృతి చెందారు. 60 ఏళ్ల కెరీర్‌లో 48 వేలకు పైగా పాటలు పాడారు. ఆమె మృతిపై పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

జానకి, చిరంజీవి
జానకి, చిరంజీవి

S Janaki: ప్రముఖ గాయని ఎస్. జానకి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. వారు తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటుగా మొత్తం 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్నారని గుర్తుచేశారు. జానకమ్మ గారి మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ జానకి గారు కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా జానకి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. “దక్షిణాది గానకోకిల, పద్మభూషణ్ గ్రహీత (తిరస్కరించినప్పటికీ గౌరవించబడే) ఎస్. జానకి అమ్మగారి మరణవార్త మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. తెలుగు నేల కన్న గర్వకారణమైన కుమార్తె జానకమ్మ. ఆమె ఆరు దశాబ్దాల పాటు సాగించిన స్వర ప్రయాణం భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో సాటిలేని ఒక అద్భుతమైన వారసత్వాన్ని నిర్మించింది. తన అమృత గాత్రంతో తరతరాల శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన ఆమె పాటలు ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. భారతీయ చలనచిత్ర సంగీతానికి ఆమె అందించిన అమూల్యమైన సేవలు మరియు ఘనతలు శాశ్వతంగా గుర్తింపబడతాయి. ఈ కష్టసమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, కోట్లాది మంది అభిమానులకు, మరియు యావత్ సంగీత ప్రపంచానికి మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాము. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.” అంటూ ట్వీట్ చేశారు.

ఇక మెగాస్టర్ చిరంజీవి కూడా ఎక్స్ ద్వారా జానకి మృతికి సంతాపం తెలిపారు. ‘జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది. నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు… ఆ జ్ఞాపకాలు… మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు… భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం… ఒక అనుభూతి… ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో తరాలకు స్ఫూర్తిగా, మన జీవితాలకు నేపథ్య సంగీతంగా చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. శ్రీమతి ఎస్. జానకి గారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు, ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. జానకమ్మ గారు… మీ స్వరం ఎప్పటికీ అమరం. ఓం శాంతి.’ అంటూ సానుభూతి తెలిపారు.

ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా జానకి మృతిపై స్పందించారు. ‘ప్రముఖ గాయని ఎస్ జానకి గారి మరణవార్త ఎంతో బాధాకరం! తన మధురమైన గాత్రంతో నవరసాలు పండించగలిగే దిగ్గజ గాయని ఎస్ జానకి గారు. సుమారు ఆరు దశాబ్దాల పాటు, వివిధ భారతీయ భాషల్లో కొన్ని వేల పాటలు పాడి భారతీయులను అలరించారు.

జానకి గారు తన బాల్యంలో కొన్నేళ్లు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారు. జానకి గారి మరణం సంగీత ప్రపంచానికి, భారతదేశ చలనచిత్ర రంగానికి తీరని లోటు. వారు భౌతికంగా మనకు దూరమైనా, వారి పాటలు సదా మనల్ని అలరిస్తూనే ఉంటాయి. ఎస్ జానకి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అంటూ నివాళులు అర్పించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *