Last Updated:
నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ, ఆయనకు సంబంధించిన పాత వీడియో బయటకు రావడంతో జనమంతా రెచ్చిపోయి ట్రోలింగ్ చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు వైరల్ అవుతున్న సల్మాన్ ఖాన్ పాత వీడియో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సల్మాన్ మద్దతు.. నెటిజన్ల విమర్శలు:
పేపర్ లీక్ వివాదంలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులకు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించారు. “పేపర్ లీక్ అనేది విద్యావ్యవస్థలో ఉన్న అత్యంత తీవ్రమైన సమస్య. విద్యార్థులు శాంతియుతంగా చేపట్టిన ఈ ఉద్యమం ద్వారా భవిష్యత్తులో దేశంలో ఒక పారదర్శకమైన, మెరుగైన విద్యావ్యవస్థ ఏర్పాటవుతుందని ఆశిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు. కానీ, ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే సీన్ రివర్స్ అయింది. గతంలో సల్మాన్ ఖాన్ తన తండ్రి, ప్రముఖ రచయిత సలీమ్ ఖాన్ తో కలిసి ఒక టాక్ షోలో పాల్గొన్న పాత వీడియో ఒకటి బయటకు వచ్చింది.
వైరల్ వీడియోలో ఏముంది?: ఆ షోలో సలీమ్ ఖాన్ మాట్లాడుతూ.. “గతంలో మా ఇంటికి గణేశ్ అనే ఒక వ్యక్తి తరచూ వచ్చేవాడు. అతను వచ్చిన ప్రతిసారీ ఇంట్లో వాళ్లంతా ఎంతో మర్యాద చేసి, టీ ఇచ్చి కుర్చీ వేసేవారు. ఎందుకింత మర్యాద అని నేను ఆరా తీయగా.. అతను మా ఇంట్లో వాళ్లకు పరీక్షల పేపర్లు లీక్ చేసి తెచ్చేవాడని, అందుకే ఆ మర్యాదలని అర్థమైంది” అని నవ్వుతూ చెప్పారు. పక్కనే ఉన్న సల్మాన్ కూడా స్పందిస్తూ.. “మా నాన్న చెబుతోంది నా గురించే” అని సరదాగా అంగీకరించారు.
అప్పట్లో సరదాగా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. స్వయంగా పేపర్లు లీక్ చేయించుకున్న చరిత్ర ఉన్న సల్మాన్, ఇప్పుడు నీట్ విద్యార్థులకు నీతులు చెప్పడం ఏంటని నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
మరోవైపు, నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశ రాజకీయాలను సైతం వేడెక్కిస్తోంది. విద్యార్థి సంఘాలు, విపక్ష పార్టీలు, పలువురు సినీ ప్రముఖులు ఈ ఆందోళనలకు మద్దతు తెలుపుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. పేపర్ లీక్ బాధ్యులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును (Fast-track court) సైతం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. లక్షలాది మంది విద్యార్థుల కలలను ఛిద్రం చేసిన ఈ వ్యవహారంలో దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














