Last Updated:
కొందరు నేరుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తే, మరికొందరు మాత్రం చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి తమ ప్రతిభతో కథానాయిక స్థాయికి ఎదుగుతారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఈ అచ్చ తెలుగమ్మాయి.
చిత్ర పరిశ్రమలో కొందరు నేరుగా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తే, మరికొందరు మాత్రం చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి తమ ప్రతిభతో కథానాయిక స్థాయికి ఎదుగుతారు. సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది అచ్చమైన తెలుగమ్మాయి శ్రీగౌరి ప్రియ (Sri Gouri Priya). ఇంటర్మీడియట్ వరకు కాకినాడలోని శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజ్‌లో చదువుకున్న ఈ బ్యూటీ.. శేఖర్ కమ్ముల ‘ఫిదా’, ‘మనలో ఒకడు’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి మెప్పించింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చిన ‘మెయిల్’ (Mail) సినిమాతో ప్రధాన పాత్రలోకి అడుగుపెట్టింది. ఇటీవల ‘మాడ్’ (MAD), ‘లవర్’ (తమిళంలో ట్రూ లవర్), తమిళంలో జి.వి. ప్రకాశ్ సరసన ‘హ్యాపీ రాజ్’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
తాజాగా రవి నంబూరి దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం సరసన ఆమె నటించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన శ్రీగౌరి ప్రియ తన సినీ ప్రయాణం, కష్టాలు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తాను పక్కా హైదరాబాదీనని, ఇక్కడే పుట్టి పెరిగానని గౌరి తెలిపింది. ఒకప్పుడు కాలేజ్‌కు బంక్ కొట్టి నగరంలోని థియేటర్లలో సినిమాలు చూసిన తాను, ఇప్పుడు అదే తెరపై తనను తాను హీరోయిన్గా చూసుకోవడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఉద్వేగానికి గురైంది. “నేను కథల ఎంపికలో ఒక సాధారణ ప్రేక్షకురాలిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. కిరణ్ అబ్బవరంతో చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ కథను కేవలం 15 నిమిషాలు మాత్రమే విన్నాను. కథ అంత బాగా నచ్చింది. వదులుకోవడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు” అని చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు టాలీవుడ్లో పరభాషా హీరోయిన్ల డామినేషన్ ఎక్కువగా ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని గౌరి ప్రియ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం చాలా మంది దర్శక నిర్మాతలు అచ్చమైన తెలుగు మాట్లాడే అమ్మాయిలనే హీరోయిన్లుగా ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, ఇది శుభపరిణామమని ఆమె పేర్కొంది. కోలీవుడ్ నుంచి కూడా తనకు మంచి అవకాశాలు వస్తున్నాయని, భాష ఏదైనా తాను పోషించే పాత్ర సహజంగా ఉందా లేదా, దానికి తాను న్యాయం చేయగలనా లేదా అన్నదే తాను చూస్తానని స్పష్టం చేసింది.
రెమ్యూనరేషన్, బౌన్సర్లు, ఇతర లగ్జరీ సౌకర్యాల విషయంలో తనకు ఎలాంటి భారీ డిమాండ్లు లేవని గౌరి కుండబద్దలు కొట్టింది. “సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటేనే అవకాశాలు వస్తాయనేది అపోహ మాత్రమే, నేను ఆ మాటను నమ్మను. మన ప్రతిభ, మనం చేసే పనే మనకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. నా గత సినిమాలు చూసే ఇప్పుడు నాకు అవకాశాలు ఇస్తున్నారు. ‘మెయిల్’ సినిమా షూటింగ్ సమయంలో నేను ఎలాంటి లగ్జరీ కోరుకోలేదు. చిత్రబృందంతో కలిసి ఓ పల్లెటూరులోని బాయ్స్ హాస్టల్లోనే బస చేశాను” అని తన సింప్లిసిటీని చాటుకుంది.
ప్రేమ, వివాహ బంధం గురించి మాట్లాడుతూ.. బంధంలో ఆరంభంలో ఉండే ఆకర్షణ కన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలబడటమే నిజమైన ప్రేమ అని, బంధంలో అన్నింటికన్నా నమ్మకం ముఖ్యమని తన పరిపక్వతను కనబరిచింది. ఈ క్రమంలో తన తల్లి మరణాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యింది. “మూడేళ్ల క్రితం అమ్మ చనిపోవడంతో నేను తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రంలోని ‘వదలనే’ పాట విన్నప్పుడల్లా నాకు అమ్మే గుర్తుకొస్తుంది. ఆ పాట నన్ను ఎంతగానో కదిలించింది. అందుకే ఆ పాటను నేను మా అమ్మకు అంకితం చేస్తున్నా” అని శ్రీగౌరి ప్రియ భావోద్వేగానికి గురైంది.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














