Last Updated:
Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్.. కాక్రోచ్, పరాన్నజీవుల వ్యాఖ్యల తర్వాతే.. కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. అది ఆయనకు ఇబ్బంది కలిగించే అంశమే. అయినప్పటికీ ఇప్పుడు ఆయన.. అదే జెన్ జీకి సపోర్టుగా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు న్యాయం వైపే ఉంటుంది అనే సంకేతాలు ఇస్తున్నారు.
జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) అధ్వర్యంలో నీట్-యూజీ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అవకతవకలు, ఉపాధి సమస్యలపై నిరసనగా నిర్వహించిన ‘చలో సంసద్’ లేదా సంసద్ చలో పాదయాత్ర సందర్భంగా జంతర్ మంతర్ దగ్గర, పార్లమెంట్ వైపు కదులుతున్న విద్యార్థులపై పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీంకోర్టు నేడు (జులై 27) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చి, జస్టిస్ వి. మోహనల బెంచ్.. శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని స్పష్టం చేసింది. కేవలం ఆందోళన జరుగుతోందన్న కారణంతో లాఠీచార్జ్ లేదా అధిక బలప్రయోగం సమర్థించలేమని సీజేఐ సూర్యకాంత్ తెలిపారు.
“రైట్ టు పీస్ఫుల్, లా ఫుల్ ప్రొటెస్ట్ అబ్సల్యూట్లీ గ్యారంటీడ్ అండర్ కాన్స్టిట్యూషన్” అని సీజేఐ వ్యాఖ్యానించారు. పోలీసులు అధిక బలప్రయోగం చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేయించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కోర్టు సూచించింది. ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాదనీ, దేశవ్యాప్తంగా నిరసనల నిర్వహణకు ఏకరూప ప్రోటోకాల్ అవసరమని నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
సుప్రీంకోర్టు కొన్ని మధ్యంతర ఉత్తర్వులు
– విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి. కేంద్రం, అన్ని రాష్ట్రాలూ ఎత్తివేయాలి.
– అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చెయ్యాలి.
– నేర చరిత్ర లేని విద్యార్థులను విడుదల చెయ్యాలి.
– ఘటనలపై సీసీ ఫుటేజ్‌ని మాకు (సుప్రీంకోర్టుకు) సమర్పించాలి.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మహిళలు, చిన్నారులపై కూడా పోలీసులు దాడి చేశారనీ, యూనిఫాం లేకుండా సాదా దుస్తుల్లో ఉన్నవారు హింసకు పాల్పడ్డారనీ, పెల్లెట్ గన్స్ వల్ల ఓ యువకుడు చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందనీ, ఎలక్ట్రిక్ బ్యాటన్లు (షాక్ బ్యాటన్లు), ఎలక్ట్రిక్ షీల్డ్స్ వాడారని ఆరోపించారు. జూలై 20 ఘటనలో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారనీ, సీసీటీవీ, బాడీ కెమెరా ఫుటేజ్ భద్రపరచాలనీ, స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలోని SITతో దర్యాప్తు జరిపించాలని కోరారు. సాదా దుస్తుల్లో ఉండే వారిని.. గుంపును కంట్రోల్ చేసేందుకు ఉపయోగించకూడదనీ, BNS సెక్షన్ 163 ప్రొహిబిటరీ ఆర్డర్లపై స్పష్టమైన మార్గదర్శకాలు కావాలని పిటిషనర్లు కోరుతున్నారు.
పోలీసు సిబ్బందికి కూడా గాయాలు తగిలాయనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు రెండు వైపులా గాయాలు సమానంగా ఆందోళన కలిగించేవని, ప్రతి వ్యక్తి జీవితం ముఖ్యమేనని తెలిపింది. జస్టిస్ బాగ్చి.. పోలీసులకు తగిన రక్షణ పరికరాలు (హెల్మెట్లు వంటివి) ఎందుకు లేవో రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరవచ్చని అన్నారు. శాంతియుత నిరసనకు సరైన స్థలం కేటాయించాలనీ, యాంటీ-సోషల్ ఎలిమెంట్స్‌ను అడ్డుకోవాలనీ, కేవలం ఆందోళన హింసకు దారితీస్తుందని అనుకోకూడదని కోర్టు సూచించింది.
2018లో కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చెయ్యాలనీ.. టియర్ గ్యాస్, లాఠీచార్జ్, నియంత్రణ పద్ధతులపై సమగ్ర గైడ్‌లైన్స్ రూపొందించాలని పిటిషనర్లు కోరారు. కోర్టు పాన్-ఇండియా గైడ్‌లైన్స్ రూపకల్పనను పరిశీలించి, నిరసనకారులకు ఇబ్బంది కలిగించే విధానం వద్దని చెప్పింది. ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్స్ వాడలేదని తిరస్కరించినా.. CRPF లేదా RAF వైపు నుంచి పరిశోధనలు, మెడికల్ రికార్డులు ఆరోపణలను సమర్థిస్తున్నాయి. అంటే.. పెల్లెట్ గన్స్ వాడినట్లే. విచారణ నేడు ఇంకా కొనసాగుతూ ఉంది. అధికారిక తీర్పు త్వరలో రావచ్చు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jul 28, 2026 12:49 PM IST














