Last Updated:
Telegram Ban India: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక నిషేధం విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారం లేదా ఇతర అవకతవకలను అరికట్టే లక్ష్యంతో భారతదేశంలో టెలిగ్రామ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌పై జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్ష నిర్వహణ సమయంలో మాత్రమే ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని, అవి శాశ్వత నిషేధం కాదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్ (యూజీ) 2026 పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 22.75 లక్షల మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 22 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీశాయి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమానమైన వందలాది ప్రశ్నలు ముందుగానే చక్కర్లు కొట్టినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించడంతో పరీక్ష విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ సంయుక్తంగా మే 3న జరిగిన పరీక్షను రద్దు చేసి జూన్ 21న పునఃపరీక్ష నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను తర్వాత మార్చి వాటికి అసలు టైమ్‌స్టాంప్‌ను అలాగే ఉంచడం ద్వారా “పేపర్ లీక్” జరిగినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను లక్ష్యంగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది. అభ్యర్థులను మోసం చేయడానికి అనేక టెలిగ్రామ్ ఛానెళ్లు, గ్రూపులు, బాట్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ఇప్పటికే పలు ఫేక్ ఛానెళ్లు, గ్రూపులను తొలగించినప్పటికీ, పరీక్ష సమగ్రతను కాపాడేందుకు ప్లాట్‌ఫారమ్ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొంది.
Telegram access restricted in India for re- NEET following recommendations of NTA
“Ministry of Electronics and Information Technology has issued notification a direction under Section 69 A of the Information Technology Act, 2000, restricting access to the Telegram platform in… pic.twitter.com/3TzJepOoej
— ANI (@ANI) June 16, 2026
ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులకు తాత్కాలిక అసౌకర్యం కలగవచ్చని ఎన్‌టీఏ అంగీకరించింది. అయితే దేశంలోని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షలలో ఒకటైన నీట్ పరీక్ష పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగడం కోసం ఈ చర్యలు తప్పనిసరి అయ్యాయని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సమాచార సాంకేతిక చట్టం-2000లోని సెక్షన్ 69A కింద నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం జూన్ 22 వరకు టెలిగ్రామ్ సేవలకు భారతదేశంలో పరిమిత ప్రాప్యత మాత్రమే ఉంటుంది. అదేవిధంగా జూన్ 30 వరకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్‌ను నిలిపివేయాలని టెలిగ్రామ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Jun 16, 2026 10:49 AM IST













