Last Updated:
తిరుమల బ్రహ్మోత్సవాల్లో మలయప్పస్వామికి ప్రత్యేక మాలలు సమర్పిస్తారు. తిరుప్పూరు దాతలు 15 ఏళ్లుగా ఈ సేవ చేస్తున్నారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కొన్ని సేవలు, సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో ప్రత్యేక మాలల సమర్పణ కూడా ఒకటి. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, ఏడో రోజు జరిగే స్నపన తిరుమంజనం సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఈ ప్రత్యేక మాలలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. తమిళనాడులోని తిరుప్పూరుకు చెందిన దాతల సహకారంతో గత 15 ఏళ్లుగా ఈ సేవ కొనసాగుతోంది.
ప్రతి ఏడాది శ్రీవారి సేవలో భాగంగా దాతలు అరుదైన పూలు, సుగంధ ద్రవ్యాలు, సహజ పదార్థాలను ఉపయోగించి ప్రత్యేకంగా మాలలు, కిరీటాలను తయారు చేయిస్తున్నారు. ఈ ఏడాది కూడా స్నపన తిరుమంజనం కోసం ప్రత్యేక మాలలను సిద్ధం చేశారు. సాధారణ పూలమాలలకు భిన్నంగా ఉండేలా గులాబీ రేకులు, నందివర్ధనం, తామర పూలతో పాటు పలు రకాల సుగంధ ద్రవ్యాలను ఇందులో ఉపయోగించారు.
ఈ మాలల్లో మరో ప్రత్యేకత ఏంటంటే.. పసుపు కొమ్ములు, బాదం, పిస్తా, ఎండుద్రాక్ష, వట్టివేరు, యాలకులు వంటి సహజ పదార్థాలను కూడా వినియోగించారు. భూమి నుంచి తాజాగా సేకరించిన సహజ పదార్థాలను ఉపయోగించి వీటిని రూపొందించారు. స్వామివారిపై భక్తితో పాటు తమకు చేతనైన విధంగా శ్రీవారి సేవలో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో దాతలు ప్రతి ఏడాది ఈ మాలలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
స్నపన తిరుమంజనం జరిగే రెండో రోజు, ఏడో రోజు మాత్రమే ఈ ప్రత్యేక మాలలను శ్రీవారికి సమర్పిస్తారు. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఈ మాలలు, ప్రత్యేక కిరీటాలతో అలంకరణ చేస్తారు. అరుదైన పూలు, సుగంధ ద్రవ్యాలు, సహజ పదార్థాలతో రూపొందించిన ఈ మాలలు బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సేవను ప్రత్యక్షంగా చూసే భక్తులకు కూడా ఇది ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.
ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా తిరుప్పూరు దాతలు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ ప్రత్యేక సేవను కొనసాగిస్తున్నారు. ప్రతి ఏడాది కొత్తగా సహజ పదార్థాలను సమకూర్చి మాలలు, కిరీటాలను తయారు చేయించి సమర్పించడం ద్వారా తమ భక్తిని చాటుకుంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సంప్రదాయాల్లో భాగంగా కొనసాగుతున్న ఈ ప్రత్యేక మాలల సమర్పణ కార్యక్రమం భక్తులలో ఆసక్తిని కలిగిస్తోంది.













