Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! | | ACTPnews

News18


Last Updated:

Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు

News18
News18

తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఇచ్చిన ఆదేశాలతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.

దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం, పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం లింగంగుంట గ్రామానికి చెందిన బొడపాటి నవీన్ చౌదరి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో పనిచేస్తున్నట్లు, ఎంప్లాయీస్ కోటాలో ప్రత్యేక దర్శనాలు, వసతి గదులు ఇప్పించగలనని సోషల్ మీడియా వేదికగా ప్రకటనలు ఇచ్చేవాడు. ఫోన్ కాల్స్ ద్వారా భక్తులను నమ్మించి తన మాయమాటలతో బుట్టలో వేసుకునేవాడు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలో పనిచేస్తున్న సూర్యకళ అనే మహిళ ఈ నిందితుడి బారిన పడ్డారు. తనతో పాటు మరో ఐదుగురికి (మొత్తం ఆరుగురికి) శ్రీవాణి దర్శనం టికెట్లు కావాలని ఆమె నవీన్ చౌదరిని సంప్రదించారు. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు మొదట యూపీఐ (UPI) ద్వారా రూ. 47,000 వసూలు చేశాడు. ఆ తర్వాత వారు తిరుమలకు చేరుకున్నాక, మరో రూ. 18,000 నగదు రూపంలో తీసుకున్నాడు.

మొత్తంగా రూ. 65,000 స్వాహా చేసిన నిందితుడు, టికెట్లు ఇవ్వకుండా మొహం చాటేశాడు. బాధితురాలు తాను మోసపోయానని గ్రహించి తిరుమల II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

నిందితుడి బ్యాంక్ లావాదేవీలు, మొబైల్ సిగ్నల్స్, యూపీఐ ట్రాన్సాక్షన్ల ఆధారంగా అతని కదలికలను కనిపెట్టారు. పల్నాడు జిల్లాలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తన నేరాన్ని అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ. 45,000 నగదు, ఒక రెడ్ మీ మొబైల్ ఫోన్, రెండు బ్యాంక్ పాస్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు.

నవీన్ చౌదరిపై విచారణ జరిపిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను 2021 నుంచి 2026 మధ్య కాలంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఇలాంటి నాలుగు చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతని బ్యాంక్ ఖాతాలను పరిశీలించగా, దాదాపు రూ. 10 లక్షలకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి ఇతను వందలాది మంది భక్తులను మోసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు భక్తులకు కీలక సూచనలు చేశారు దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదం వంటి ఏ సేవకైనా కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ (tirupatibalaji.ap.gov.in) లేదా మొబైల్ యాప్ మాత్రమే వాడాలి. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను, వాట్సాప్ మెసేజ్‌లను నమ్మి అపరిచితులకు డబ్బులు పంపవద్దు.

టీటీడీ ఏ సందర్భంలోనూ వ్యక్తిగత యూపీఐ ఐడీలకు లేదా ప్రైవేట్ వ్యక్తుల ఖాతాలకు డబ్బులు చెల్లించమని కోరదు. ఎవరైనా ఇలాంటి ఆశలు చూపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయాలి. ప్రస్తుతం కోర్టు నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports