Tirupati: మంచి చేయడానికి వస్తే చంపేశారు.. పెళ్లిలో రక్తపాతం.. తిరుపతిలో ఇద్దరి దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Tirupati: మంగళవాయిద్యాలు, అక్షింతలతో కలకలలాడాల్సిన ఒక కల్యాణ మండప ప్రాంగణం క్షణాల వ్యవధిలో రక్తసిక్తంగా మారింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

విడిపోయిన ఒక కుటుంబాన్ని కలిపి, ఒకరి జీవితంలో వెలుగులు నింపాలని మంచి మనసుతో వచ్చిన ఇద్దరు మధ్యవర్తులు దారుణ హత్యకు గురయ్యారు. తిరుపతిలోని పద్మావతి కల్యాణ మండపం-1లో బుధవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం, తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసు దారుణ నేపథ్యం ఇలా ఉంది.

అసలు కథ ఇదే

తిరుమలకు చెందిన వ్యాపారి సంపూర్ణమ్మ కుమార్తెను, ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్ అనే వ్యక్తికి ఇచ్చి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, కొన్ని మనస్పర్థల కారణంగా గత కొంతకాలంగా ఈ భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి అదే కల్యాణ మండపంలో జంగాలపల్లికి చెందిన వారి బంధువుల వివాహం ఒకటి జరుగుతోంది. ఈ పెళ్లి వేడుకకు అల్లుడు సునీల్ వస్తాడని తెలుసుకున్న అత్త సంపూర్ణమ్మ, ఎలాగైనా పెద్ద మనుషులతో మాట్లాడించి తన కూతురు సంసారాన్ని చక్కదిద్దాలని భావించింది.

ఇందుకోసం ఆరేళ్ల క్రితం వారి పెళ్లి పెద్దగా వ్యవహరించిన ఏర్పేడు మండలం పల్లంగొల్లపల్లికి చెందిన మునిరత్నం యాదవ్ (32)ను సంప్రదించింది. ప్రస్తుతం తిరుమలలో గాజుల వ్యాపారం చేసుకుంటున్న మునిరత్నం, ఈ సమస్యను పరిష్కరించేందుకు తన స్నేహితుడైన జేసీబీ డ్రైవర్ మణికంఠ (30)ను తోడుగా తీసుకుని పెళ్లి వేడుకకు వచ్చారు.

చర్చల సమయంలో ఘర్షణ.. కత్తులతో విచక్షణా రహితంగా దాడి!

కల్యాణ మండపంలో మునిరత్నం, మణికంఠలిద్దరూ సునీల్‌ను కలిసి భార్యాభర్తల గొడవలపై చర్చలు ప్రారంభించారు. ఈ సంభాషణ కాస్తా ఇరువర్గాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీల్.. వెంటనే ఫోన్ చేసి తన తండ్రి, తమ్ముడు, అల్లుడు, మరో వ్యక్తిని కల్యాణ మండపం వద్దకు రప్పించాడు.

చర్చలు విఫలం కావడంతో మునిరత్నం, మణికంఠలు తమ ద్విచక్ర వాహనంపై తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా వారు బైక్ స్టార్ట్ చేసి బయలుదేరుతున్న సమయంలో, సునీల్, అతని కుటుంబ సభ్యులు పక్కా ప్లాన్‌తో కత్తులతో వారిపై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు.

ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు

ఈ హఠాత్ పరిణామానికి భయపడిన బంధువులు, అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. నిందితులు విచక్షణా రహితంగా నరకడంతో మునిరత్నం యాదవ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు తీవ్ర రక్తగాయాలైన మణికంఠ తన ప్రాణాలను కాపాడుకోవడానికి రక్తపు ధారలతోనే కల్యాణ మండపం ప్రధాన గేటు వైపు పరుగులు తీశాడు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే అతనిని రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

మంచి చేయబోతే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోర హత్యోదంతంపై కేసు నమోదు చేసుకున్న తిరుపతి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భయానక వాతావరణం నెలకొనడంతో కల్యాణ మండపం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed