Last Updated:
Tirupati: రద్దీగా ఉండే ప్రాంతాలు, కాలేజీ క్యాంపస్లు, విద్యాసంస్థల ప్రాంగణాలు, నివాస సముదాయాల వద్ద నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాలే వారి టార్గెట్. క్షణాల్లో బైక్లను మాయం చేయడం.. ఎవరికీ అనుమానం రాకుండా దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ పొదల్లో దాచిపెట్టడం.. ఆపై గుట్టుచప్పుడు కాకుండా విక్రయించడం వీరి నిత్యకృత్యం.
గత కొంతకాలంగా తిరుపతి పరిసర ప్రాంతాలతో పాటు పొరుగు జిల్లాల్లో వరుస ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన అంతర్ జిల్లా దొంగల ముఠా ఆటను తిరుపతి జిల్లా పోలీసులు కట్టడి చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలు, చోరీలకు ఉపయోగించిన ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం (డీపీవో)లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఈ కేసుకు సంబంధించిన సమగ్ర వివరాలను మీడియాకు వెల్లడించారు.














