సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మహిళాశక్తి సభలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక బృందాలకు ఆయన 553 ఆర్టీసీ బస్సులను పంపిణీ చేశారు. మహిళలతో పెట్టుకున్నందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోయిందని సీఎం విమర్శించారు. మహిళల ఉచిత ప్రయాణం కోసం తమ ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10,500 కోట్లు చెల్లించిందని చెప్పారు.
2. బాధితులకు అండగా ఉంటాం:
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులను కేజీహెచ్ ఆసుపత్రిలో రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత పరామర్శించారు. వీరితో పాటు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, ఎంపీ శ్రీభరత్ బాధితుల కుటుంబాలను కలిసి ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున జీవితకాలం అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. కాంట్రాక్ట్, పర్మనెంట్ అనే తేడా లేకుండా మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.
3. 25 లక్షల పరిహారం:
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడమే అందరి సంకల్పమని పవన్ కళ్యాణ్ చెప్పారు.
4. రేవంత్ వీధి రౌడీలా మాట్లాడుతున్నారు
తనపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తన స్థాయిని మరిచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నానంటూ రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తూ బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి గులాంగా వ్యవహరిస్తున్నారని, తానే ఎవరికీ గులాం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
5. మహిళల రక్షణ కోసం..‘సింగప్పెన్’ టాస్క్ ఫోర్స్:
తమిళనాడులో మహిళలు, పిల్లల రక్షణ కోసం సీఎం విజయ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ అనే ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ ప్రత్యేక విభాగం కోసం ప్రభుత్వం రూ.354 కోట్లు కేటాయించిందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో ఏ మహిళా భయంతో జీవించకూడదని, స్త్రీలపై వేధింపులు సమాజానికి సంబంధించిన సమస్యని ఆయన అన్నారు.
6. తెలంగాణకు భారీ వర్షాలు
తెలంగాణలో రాగల రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బుధవారం వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
7. నిర్మాతగా నాగచైతన్య.
అక్కినేని నాగచైతన్య కెరీర్లో హిట్ అయిన ‘దూత’ వెబ్ సిరీస్ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌కు సీనియర్ నటుడు నాగార్జున క్లాప్ కొట్టి పనులను ప్రారంభించారు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్‌తో నాగచైతన్య తొలిసారి నిర్మాతగా మారారు. ఇందులో పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్‌తో పాటు భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
8. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు
కర్ణాటకలో రూ.2,400 కోట్ల అక్రమ డిపాజిట్ కేసులో సీఐడీ, దర్యాప్తు వేగవంతం చేసింది. ‘ఛాంపియన్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు నటి సన్నీ లియోన్‌కు రూ.1 కోటి అందినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమ సొమ్ము నుంచే ఆ డబ్బులు చెల్లించారా అనే కోణంలో ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో కన్నడ ఉత్సవంలో పాల్గొన్న మరికొంతమంది నటీనటులకు కూడా నోటీసులు ఇవ్వడానికి సీఐడీ సిద్ధమైంది.
9. ఇరాన్‌కు నెతన్యాహు వార్నింగ్
మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ దేశం ఇజ్రాయెల్‌పై ఇటీవల భారీగా క్షిపణి దాడులు జరిపింది. ఈ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. తాజా పరిస్థితుల్లో ఇరాన్ దేశానికి నెతన్యాహు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు.
10. ట్రంప్ ఒంటరిగా మిగిలిపోతావు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన పరస్పర దాడుల మధ్య, ప్రతీకార దాడులను ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యకు దిగితే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందని, తాము కూడా మద్దతు ఇవ్వబోమని ట్రంప్ స్పష్టం చేశారు.












