Last Updated:
తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి భారీ స్థాయిలో మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి దాన్ని సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలని అధికారులు పిలుపునిచ్చారు.
తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సూచనలకు అనుగుణంగా, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు తిరుమలలోని ఆక్టోపస్ క్యాంపస్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. తిరుమల డీఎస్పీ శ్రీ విజయ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఆక్టోపస్ సిబ్బంది, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో చెట్ల పాత్ర ఎంతో కీలకమని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలనే సందేశాన్ని ఈ సందర్భంగా అందించారు.
ఈ సందర్భంగా తిరుమల డీఎస్పీ శ్రీ విజయ శేఖర్ మాట్లాడుతూ, మొక్కలు మనిషి మనుగడకు ఆధారమని, అవి ప్రాణవాయువును అందించడంతో పాటు కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. పెరుగుతున్న పర్యావరణ సమస్యలను అధిగమించాలంటే ప్రతి పౌరుడు చెట్ల సంరక్షణను తన బాధ్యతగా భావించాలని సూచించారు. అలాగే జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పోలీసు శాఖ కేవలం శాంతి భద్రతల పరిరక్షణకే కాకుండా ప్రకృతి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పర్యావరణహిత కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం ముగింపులో పోలీసు అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఆక్టోపస్ అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు కట్టుబడి పనిచేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.
Hyderabad,Telangana
Aug 05, 2026 10:01 PM IST














