Last Updated:
యూపీఐ వినియోగదారులకు కేంద్రం కీలక ప్రకటన చేసింది. రూ.2,000 వరకు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. అయితే రూ.2,000 దాటిన చెల్లింపుల విషయంలో అసలు ఏం జరగబోతోంది? కాంగ్రెస్ ఎందుకు తీవ్ర ఆరోపణలు చేస్తోంది? పూర్తి వివరాలు తెలుసుకోండి.
దేశంలో అత్యంత విస్తృతంగా వినియోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐపై కొత్త వివాదం మొదలైంది. రూ.2,000 వరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు, అలాగే రూపే డెబిట్ కార్డు ద్వారా చేసే చెల్లింపులపై బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల సంస్థలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి రుసుము విధించకూడదని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 14న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అవకాశం ఉందన్న కాంగ్రెస్ ఆరోపణలతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది.
2007 నాటి పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10A కింద ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ చట్టానికి సవరణ బిల్లును ఆమోదించింది. ఆగస్టు 13, 2026న ముగిసిన వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత, యూపీఐపై ఎండీఆర్ రేట్లను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలోని UPI అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తుందని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు లావాదేవీ మొత్తం ఎంతైనా యూపీఐపై ఎలాంటి ఛార్జీ లేదు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ప్రభుత్వం యూపీఐపై ఫీజులు విధించేందుకు నిశ్శబ్దంగా మార్గం సుగమం చేసిందని ఆరోపించారు. రూ.2,000కు మించిన వ్యాపారి యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ విధించవచ్చని, ఇలాంటి లావాదేవీలు పరిమాణంలో కేవలం 5 శాతం ఉన్నప్పటికీ మొత్తం యూపీఐ లావాదేవీల విలువలో దాదాపు 65 శాతం వాటా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులపై నేరుగా ఛార్జీ ఉండదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వ్యాపారులపై పడే భారాన్ని చివరకు వస్తువుల ధరల పెంపు రూపంలో వినియోగదారులే భరించాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
मोदी सरकार ने चुपचाप UPI पर फ़ीस लगाने का रास्ता खोल दिया है।
अब ₹2,000 से ऊपर के merchant UPI लेन-देन पर MDR लगाया जा सकता है। इन ट्रांजैक्शंस की संख्या भले ही सिर्फ़ 5% हो, लेकिन UPI के कुल transaction value का करीब 65% इन्हीं में है।
सरकार कहती है कि ग्राहक से कोई फ़ीस नहीं…
— Rahul Gandhi (@RahulGandhi) September 15, 2026
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కూడా ఇదే అంశంపై స్పందించారు. రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలకు మాత్రమే ఛార్జీలు విధించకుండా నోటిఫికేషన్ జారీ చేశారని, అంతకంటే ఎక్కువ మొత్తాల లావాదేవీలకు స్పష్టమైన రక్షణ లేదని ఆరోపించారు. భవిష్యత్తులో పరిమితిని మార్చి, వ్యక్తుల మధ్య రోజువారీ చెల్లింపులపైనా రుసుము విధించే అవకాశం ఉందని అన్నారు. ఈ చర్య అమెరికా సంస్థలకు డిజిటల్ చెల్లింపుల రంగాన్ని తెరవడానికి ఉద్దేశించిందా అని కూడా కాంగ్రెస్ ప్రశ్నించింది.
మరోవైపు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. ఎండీఆర్ అనేది వినియోగదారులకు కాకుండా వ్యాపారులపై మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. దీనివల్ల బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక వసతులు, భద్రత, ఆవిష్కరణలపై మరింత పెట్టుబడులు పెట్టగలవని వివరించారు. ఎన్‌పీసీఐ నేతృత్వంలోని కమిటీ ఇంకా ఎండీఆర్‌ను నిర్ణయించలేదని ఆమె స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, భారత్‌పే సహ వ్యవస్థాపకుడు అశ్నీర్ గ్రోవర్ కూడా యూపీఐపై ఛార్జీలు విధించే ఆలోచనను విమర్శించారు. అలా చేస్తే అది పన్ను వసూలు చేసినట్టేనని, ఉచిత యూపీఐనే అసలైన యూపీఐ అని వ్యాఖ్యానించారు. ఛార్జీలు వస్తే వినియోగదారులు, వ్యాపారులు మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఐని ఎన్‌పీసీఐ నిర్వహిస్తోంది. ఇది ఆర్‌బీఐ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చొరవతో ఏర్పడిన సంస్థ.














