Last Updated:
US Open 2026: టెన్నిస్ దిగ్గజం, నాలుగో సీడ్ నోవాక్ జకోవిచ్‌కు యూఎస్ ఓపెన్‌లో ఊహించని షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో న్యూయార్క్‌లో అడుగుపెట్టిన 39 ఏళ్ల జకోవిచ్ ప్రయాణం తొలి రౌండ్లోనే ముగిసింది.
తీవ్రమైన ఎండ, తేమ, అనారోగ్యం, శారీరక అలసటతో పోరాడిన జకోవిచ్.. అర్జెంటీనా ఆటగాడు మరియానో నవోన్‌తో జరిగిన మారథాన్ ఐదు సెట్ల పోరులో 6-7, 7-5, 6-4, 2-6, 1-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఆర్థర్ యాష్ స్టేడియంలో మ్యాచ్ ఆరంభం నుంచే జకోవిచ్ శారీరకంగా ఇబ్బంది పడుతూ కనిపించాడు. న్యూయార్క్‌లోని తీవ్ర ఉక్కపోత, తేమ వాతావరణం వల్ల తలపై పదే పదే ఐస్ బ్యాగ్ పెట్టుకున్నాడు. వర్షం కారణంగా స్టేడియం రూఫ్ మూసివేసినప్పుడు ఏసీ ఆన్ చేయాలని సూపర్వైజర్ను కూడా కోరాడు. మూడో సెట్ ఆరో గేమ్‌లో పరిస్థితి మరింత విషమించి, జకోవిచ్ కోర్టు వెనుకభాగంలో పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. టోర్నమెంట్ ఫిజియో అతనికి మాత్రలు అందించగా, కోర్టు పక్కనుంచి సహాయక బృందం ద్రవాలు అందించింది.














