US tariffs: రష్యా, ఇరాన్‌లపై అమెరికా కొరడా.. భారత్‌పై 100% సుంకాల బాంబు? ట్రంప్ సంచలన నిర్ణయం! | | ACTPnews

News18


Last Updated:

US tariffs: అంతర్జాతీయ వాణిజ్య, భౌగోళిక రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది.

ట్రంప్ (ఫైల్ ఫోటో)
ట్రంప్ (ఫైల్ ఫోటో)

రష్యా, ఇరాన్‌లపై కఠిన ఆంక్షలను విధించడంతో పాటు, ఆ దేశాల నుంచి ముడి చమురు, ఇంధన వనరులను దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా వంటి ప్రధాన దేశాలపై భారీ ప్రతీకార సుంకాలు మోపే విశేషాధికారాలను అమెరికా అధ్యక్షుడికి కట్టబెట్టే కీలక బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ‘ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం-2026’ పేరిట రూపొందించిన ఈ వివాదాస్పద బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో భారీ మెజారిటీతో నెగ్గింది. గత నెలలోనే సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడమే తరువాయిగా మారింది. ఈ తాజా పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్‌తో పాటు ద్వైపాక్షిక సంబంధాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.

బిల్లు నేపథ్యం.. సభలో మద్దతు

ప్రతినిధుల సభలో బుధవారం జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. సభలో అధికార రిపబ్లికన్ పార్టీకి 218 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ, ప్రత్యర్థి డెమోక్రాట్ల నుంచి 59 మంది సభ్యులు, మరొక స్వతంత్ర సభ్యుడు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం విశేషం. ట్రంప్‌నకు అత్యంత విధేయుడు, సౌత్ కరోలినా సెనేటర్ అయిన లిండ్సే గ్రాహం దాదాపు ఏడాది కాలంగా ఈ చట్టం కోసం తీవ్రంగా శ్రమించారు. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తెరపైకి తెచ్చారు.

అధ్యక్షుడికి దక్కే విస్తృత అధికారాలు

ఈ చట్టం అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు లభిస్తాయి. రష్యా రాజకీయ నాయకత్వం, కీలక ఇంధన రంగాలపై ఏకపక్ష ఆంక్షలు విధించవచ్చు. అంతర్జాతీయ ఆంక్షలను దాటవేస్తూ సముద్ర మార్గాల్లో రష్యా ముడి చమురును రవాణా చేస్తున్న ‘డోలార్ షాడో ఫ్లీట్’ నౌకలపై కఠిన నిబంధనలు అమలు చేయవచ్చు. రష్యా చమురు, సహజ వాయువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలంటూ ఒత్తిడి తెస్తూ, ఆ దేశంతో వాణిజ్యం కొనసాగించే భారత్, చైనా లాంటి దేశాలపై ఏకంగా 100 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడి చేతుల్లోకి వెళ్తుంది. ఇరాన్ చమురు వ్యాపారం, ఆర్థిక లావాదేవీలపై మరిన్ని పకడ్బందీ ఆంక్షలు అమలు చేయవచ్చు.

భారత్ గట్టి కౌంటర్

అమెరికా ప్రతిపాదిత చర్యలపై భారత్ అత్యంత ఘాటుగా స్పందించింది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ఇంధన భద్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా మార్కెట్లో లభించే భిన్నమైన మార్గాల ద్వారా ఇంధన అవసరాలను తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఈ బిల్లు వల్ల ఏర్పడే పర్యవసానాలపై ఇప్పటికే అమెరికా దౌత్య ప్రతినిధులతో పలు దఫాలుగా ఉన్నత స్థాయి చర్చలు జరిపామని భారత్ వెల్లడించింది. రష్యాపై ఆంక్షల నెపంతో తమపై సుంకాలు విధిస్తే, అది భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరల అస్థిరతకు దారితీస్తుందని హెచ్చరించింది.

చైనా ఆగ్రహం.. ఐరాస ఆమోదం ఉండాల్సిందే

మరోవైపు ఈ బిల్లుపై చైనా సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం లేని ఎలాంటి ఏకపక్ష ఆంక్షలను చైనా అంగీకరించబోదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియావోతున్ స్పష్టం చేశారు. పరస్పర ప్రయోజనాలు, సమానత్వ ప్రాతిపదికన తాము అన్ని దేశాలతో వాణిజ్య సంబంధాలను నెరుపుతున్నామని, మూడో దేశం తమ వ్యాపార సమన్వయాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నెలాఖరులో అమెరికా పర్యటనకు వెళ్లనున్న సమయంలో ఈ బిల్లు ఆమోదం పొందడం దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports