Last Updated:
వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ స్టాగర్డ్ మోడల్ ద్వారా దర్శన ఏర్పాట్లు, క్యూ లైన్లలో అన్నప్రసాదం, పానీయాలు, సౌకర్యాలు బలోపేతం చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతుండటంతో టీటీడీ అదనపు ఈవో వెంకట చౌదరి క్యూలైన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా “స్టాగర్డ్ మోడల్” విధానంలో దర్శన ఏర్పాట్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల ప్రయోజనాలనే పరమావధిగా తీసుకుని టీటీడీ ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. భక్తుల రద్దీని బట్టి పీఏసీలు, ఔటర్ క్యూ లైన్ల వినియోగం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సమన్వయం చేస్తూ దర్శనాన్ని సాఫీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. క్యూ లైన్లు పూర్తిగా నిండిన సమయంలో భక్తులను తాత్కాలికంగా పీఏసీలకు మళ్లించి, రద్దీ తగ్గిన వెంటనే తిరిగి దర్శనానికి అనుమతిస్తున్నామని వివరించారు.
ఇటీవల సోషల్ మీడియాలో తిరుమల ఏర్పాట్లపై వస్తున్న ప్రతికూల ప్రచారాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. తిరుమలలో అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని, భక్తులకు అవసరమైన ప్రతి సౌకర్యం అందుబాటులో ఉంచామని అదనపు ఈవో తెలిపారు. ముఖ్యంగా క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, అల్పాహారం, పానీయాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
వెంగమాంబ అన్నదాన సత్రం ద్వారా రోజుకు లక్షలాది మంది భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదం అందిస్తున్నామని తెలిపారు. ఎంటీవీఏసీ, అక్షయ, వకులమాత కిచెన్ల ద్వారా ఔటర్ క్యూ లైన్లు, పీఏసీలలో వేచి ఉన్న భక్తులకు నిరంతరం భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఉదయం 3 గంటల నుంచే వంట ప్రక్రియ ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో కేవలం 15 నిమిషాల్లోనే భారీ స్థాయిలో ఉప్మా సిద్ధం చేసే ఆధునిక సామర్థ్యం తమ వద్ద ఉందని తెలిపారు.
భక్తులకు నిర్ణీత సమయాల్లో అల్పాహారం, భోజనంతో పాటు పాలు, బాదం పాలు, మజ్జిగ వంటి పానీయాలు కూడా అందిస్తున్నామని టీటీడీ వెల్లడించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఫీల్డ్, కుకింగ్, లాజిస్టిక్స్ విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ టీమ్ వర్క్ ద్వారా భక్తులకు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. రియల్ టైమ్ డేటా విశ్లేషణ ఆధారంగా భక్తులు క్యూ లైన్లలో ప్రవేశించిన సమయం నుంచి దర్శనం పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తూ మరింత సమర్థవంతమైన నిర్వహణ చేపడుతున్నామని అదనపు ఈవో వెంకట చౌదరి వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Tirumala,Chittoor,Andhra Pradesh
May 22, 2026 10:05 PM IST












