బిఆర్ఎస్‌కు షాక్… కవిత టిఆర్ఎస్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు మారేనా..? | వరంగల్ వార్తలు (Warangal News) | ACTPnews

కొత్త


Last Updated:

కల్వకుంట్ల కవిత మేడ్చల్ మునిరాబాద్‌లో కొత్త టిఆర్ఎస్ పార్టీని ప్రకటించారు, బిఆర్ఎస్ వైఫల్యాలపై విమర్శలు, మహిళలు యువతకు ప్రాధాన్యమని, కొత్త ప్రాంతీయ ప్రత్యామ్నాయంగా చర్చ సాగుతోంది

+

కొత్త పార్టీ సక్సెస్ సాధించేనా… కవిత వ్యూహం ఎలా ఉండబోతుంది..?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పేరుతో పార్టీని స్థాపిస్తూ, మేడ్చల్ జిల్లా మునిరాబాద్‌లో నిర్వహించిన భారీ సభలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కవిత వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ప్రాణాలు అర్పించబడ్డాయని గుర్తు చేసిన కవిత, రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తయినా ప్రజల ఆశయాలు పూర్తిగా నెరవేరలేదని అన్నారు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మలా మారి సేవ చేయాలనుకుంటున్నా అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. మహిళా దృక్పథంతో పరిపాలన జరిగితేనే రాష్ట్రం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

కవిత స్థాపించిన ఈ కొత్త పార్టీపై రాజకీయ వర్గాల్లో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ జాగృతి వరంగల్ జిల్లా నాయకుడు సోల్తీ కిషోర్ మాట్లాడుతూ, ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. “ప్రశ్నిస్తాం, పోరాడుతాం, పరిష్కరిస్తాం అనే నినాదంతో పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ జాగృతి ద్వారా కవిత గతంలో ఎన్నో సమస్యలను పరిష్కరించారని, ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఖమ్మం భూదాన్ భూముల సమస్యలో బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ ప్రజా సమస్యలపై సమర్థంగా స్పందించడంలో విఫలమైందని విమర్శించారు.

ఇదిలా ఉండగా, వరంగల్‌కు చెందిన ప్రకాష్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో బీసీ వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో కవిత కొత్త పార్టీ స్థాపించడం ఆ వర్గాలకు మద్దతుగా భావించవచ్చని అన్నారు. ఇది అవకాశవాద రాజకీయంగా కాకుండా చిత్తశుద్ధితో ముందుకు సాగాలని సూచించారు. గతంలో పలువురు నాయకులు పార్టీలు స్థాపించి తర్వాత ఇతర పార్టీల్లో విలీనం చేసిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో గత పదేళ్లు బిఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన కొనసాగుతున్నప్పటికీ, ప్రజల్లో కొంత అసంతృప్తి పెరుగుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఖాళీని భర్తీ చేసే దిశగా కవిత పార్టీ ప్రయాణం ప్రారంభమైందని భావిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే నినాదంతో సాగిందని, ఆ లక్ష్యాల సాధనలో ఇప్పటికీ లోటు ఉందని తెలంగాణ జాగృతి నాయకుడు తడిగొప్పుల మల్లేష్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడంతో ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, కానీ కాంగ్రెస్ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. అందుకే ప్రాంతీయ పార్టీ అవసరం మళ్లీ ముందుకు వచ్చిందని తెలిపారు.

ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణకు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అవసరమని వరంగల్‌కు చెందిన యువకుడు సుధీర్ అభిప్రాయపడ్డారు. మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కవిత ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. గత పాలనలపై ప్రజలు ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని, ఈ కొత్త పార్టీకి ప్రజల మద్దతు లభించే అవకాశం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం మీద, కవిత స్థాపించిన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తూ, భవిష్యత్తులో కీలక పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports