యూట్యూబర్ రావణ్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో కీలక ఆధారాలు? | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచిన రావణ్‌పై ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

News18
News18

యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. హిందూ దేవతలు, ప్రజాప్రతినిధులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలిచిన రావణ్‌పై ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ పరీక్షల్లో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ కేసు పరిధిని పోలీసులు మరింత విస్తరించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 1న పిఠాపురం పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మరో కేసు విచారణ నిమిత్తం కాకినాడలోని సర్పవరం పోలీసులు అతడిని తమ అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో నమోదైన కేసు దర్యాప్తు సందర్భంగా పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అందులోని డేటాను పరిశీలించారు. అయితే అప్పటికే ఫోన్‌లో ఉన్న కొన్ని వీడియోలు, ఫొటోలు, ఇతర డేటాను రావణ్ తొలగించినట్లు గుర్తించారు.

దీంతో తొలగించిన సమాచారాన్ని తిరిగి వెలికితీసేందుకు పోలీసులు మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. తాజాగా అందిన ఫోరెన్సిక్ నివేదికలో కొన్ని కీలక డిజిటల్ ఆధారాలు లభించినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

దర్యాప్తులో భాగంగా అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని వారితో అనుచితంగా ప్రవర్తించినట్లు, అలాగే వ్యక్తిగత సందర్భాల్లో తీసిన ఫొటోలు, వీడియోలను చూపిస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా ఇప్పటికే పలువురు మహిళలను గుర్తించి వారి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఎంతమంది బాధితులు ఉన్నారనే అంశంపై కూడా అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మరో కేసులో మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా, సాయుధ తిరుగుబాటుకు ప్రేరేపించేలా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు కూడా రావణ్‌పై కేసు నమోదు చేశారు. దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలతో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 152తో పాటు ఇతర సంబంధిత సెక్షన్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద కూడా అభియోగాలు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులకు సంబంధించి రావణ్‌ను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆయనకు ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన న్యాయస్థాన ఆదేశాల మేరకు రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలు, సోషల్ మీడియా ఖాతాలు, డిజిటల్ కమ్యూనికేషన్‌కు సంబంధించిన ఆధారాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

ఫోరెన్సిక్ నివేదికలో లభించిన సమాచారం ఆధారంగా కొత్త కేసులు నమోదయ్యే అవకాశం ఉందా, మరిన్ని బాధితులు ఉన్నారా, ఇతర వ్యక్తులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దర్యాప్తు పురోగతిపై అందరి దృష్టి నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports