Last Updated:
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది.
రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలు కావడం, మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు సికింద్రాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. “Helmet On, Worries Gone” అనే సందేశంతో భారీ హెల్మెట్ శిల్పాన్ని ఏర్పాటు చేసి ఘనంగా ఆవిష్కరించింది. ఈ శిల్పం ప్రజలకు హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ రోడ్డు భద్రతకు ప్రతీకగా నిలవనుంది.
మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణ రెడ్డి, ఐఏఎస్.. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడే రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు ఎంత చిన్న దూరం ప్రయాణించినా తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, రోడ్డు భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదకరమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర విభాగానికి వచ్చే ప్రమాద బాధితుల్లో అధిక శాతం మంది తలకు తీవ్రమైన గాయాలతో వస్తున్నారని తెలిపారు. హెల్మెట్ ధరించి ఉంటే అలాంటి ప్రమాదాల్లో గాయాల తీవ్రత గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. మెదడుకు గాయాలు అయినప్పుడు చికిత్స ద్వారా ప్రాణాలను కాపాడినా, కొన్నిసార్లు శాశ్వత వికలాంగత్వం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కోమాలోకి వెళ్లడం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని వివరించారు.
నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పం ప్రతిరోజూ వేలాది మంది దృష్టిని ఆకర్షించనుంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, ఉద్యోగులు మరియు ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. “ప్రయాణం ఎంత చిన్నదైనా హెల్మెట్ తప్పనిసరి” అనే సందేశాన్ని ఈ శిల్పం నిరంతరం గుర్తు చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమం AWARE & ALIVE పేరుతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగింది. మెడికవర్ హాస్పిటల్స్ మరియు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా వ్యవహరించేలా చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, సీనియర్ న్యూరోసర్జన్ డా. రమేష్ శిఘాకోలి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డా. బాలసుబ్రహ్మణ్యం, సెంటర్ హెడ్ కృష్ణవేణి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం నగర ప్రజల నుంచి మంచి స్పందన పొందింది.
Hyderabad,Telangana













