అర్ధరాత్రి అడవుల్లో ప్రారంభమయ్యే దివ్య సేవ.. శ్రీవారి అభిషేక జలం వెనుక గల మహా రహస్యం! Akashaganga Theertham. | | ACTPnews

News18


Last Updated:

తిరుమలనంబి వంశీయులు నేటికీ అర్ధరాత్రి ఆకాశగంగ తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తెచ్చి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అభిషేకానికి సమర్పిస్తున్నారు, టిటిడి భద్రత కల్పిస్తోంది

+

News18

కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధనలు అందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారు భక్తుల పట్ల తన అపారమైన ప్రేమను ఎన్నో సందర్భాల్లో చాటుకున్నారు. భక్తుల కష్టాన్ని తన కష్టంగా భావించే ఆపదమొక్కుల వాడు.. అనాధ రక్షకుడు శ్రీనివాసుడు అన్నమయ్య, వెంగమాంబ వంటి మహాభక్తులకు ప్రత్యక్షమై మోక్షం ప్రసాదించిన దైవంగా పురాణాలు చెబుతున్నాయి. అలాంటి శ్రీవారి నిత్య కైంకర్యాల్లో ఉపయోగించే పవిత్ర జలాల వెనుక కూడా ఓ మహత్తరమైన దైవ రహస్యం దాగి ఉంది. ప్రతి రోజు స్వామివారి అభిషేకానికి వినియోగించే ఆకాశగంగ తీర్థం ఎలా వెలిసింది..? ఆ పవిత్ర జలాన్ని ఎవరు తీసుకొస్తారు..? అనే విషయం భక్తులను ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.

తొమ్మిదో శతాబ్దంలో స్వామివారి పరమభక్తుడైన తిరుమలనంబి ప్రతిరోజూ ఉదయం అంజనాద్రిలోని పాపనాశనం తీర్థం నుంచి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి శ్రీవారి కైంకర్యాలకు సమర్పించేవారు. వయస్సు మీద పడుతున్నా ఏమాత్రం అలసట చెందకుండా స్వామి సేవకే జీవితాన్ని అంకితం చేసిన తిరుమలనంబి భక్తిని చూసి శ్రీనివాసుడు సైతం కరిగిపోయాడని చెబుతారు. ఒక రోజు జలంతో నిండిన కుండను మోసుకుంటూ వస్తున్న తిరుమలనంబి ముందు బోయవాడి రూపంలో ప్రత్యక్షమైన శ్రీహరి తన దాహం తీర్చమని అడిగాడు. అయితే అది స్వామివారి సేవకు వినియోగించే పవిత్ర జలం కావడంతో తిరుమలనంబి నిరాకరించాడు. దీంతో ఆ బోయవాడు విల్లుతో కుండకు చిన్న రంధ్రం చేసి నీటిని సేవించాడు.

కొంతదూరం వెళ్లిన తరువాత కుండ బరువు తగ్గిపోవడంతో తిరుమలనంబి వెనక్కి తిరిగి చూసి జరిగిన విషయం గ్రహించాడు. స్వామివారి సేవకు తీసుకొచ్చే పవిత్ర జలాన్ని ఇలా తాగడం సరికాదంటూ కన్నీరు పెట్టుకున్న భక్తుడి ఆవేదన చూసి శ్రీనివాసుడు తన అసలు రూపాన్ని తెలియజేయకుండా మరో మహిమ చూపించాడు. ఇకపై ఇంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు అంటూ తిరుమలనంబిని కొండ ప్రాంతానికి తీసుకెళ్లి తన విల్లుతో కొండను తాకగానే అక్కడి నుంచి జలధార ఉబికి వచ్చింది. అదే నేటి ఆకాశగంగ తీర్థమని పురాణాలు చెబుతున్నాయి. జలాన్ని తీసుకెళ్లేందుకు పాత్ర లేదని తిరుమలనంబి చెప్పగానే స్వామివారు స్వయంగా బంగారు బిందెను ప్రసాదించాడని విశ్వసిస్తారు.

ఆనాటి నుంచి నేటివరకు తిరుమలనంబి వంశీయులే ప్రతిరోజూ అర్ధరాత్రి వేళ శ్రీవారి ఆలయం నుంచి బయలుదేరి అడవులు, కొండలు దాటి ఆకాశగంగ తీర్థానికి చేరుకుంటున్నారు. ముందుగా పవిత్ర జలంతో బిందెను శుభ్రపరిచి, ఆ తర్వాత జలాన్ని బిందెలో నింపి స్వామివారిని స్మరిస్తూ నెత్తిపై ధరించుకుంటారు. గోవిందా.. గోవిందా నామస్మరణల మధ్య అంజనాదేవి ఆలయం గుండా తిరిగి సుమారు పది కిలోమీటర్ల ప్రయాణం చేసి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. తిరుమాడ వీధుల్లో అడుగుపెట్టగానే వినిపించే సుప్రభాత సేవ ధ్వనులు అర్చకుల అలసటను క్షణాల్లో దూరం చేస్తాయని చెబుతారు.

మంగళవాయిద్యాలు, చట్రాల నడుమ తిరుమలనంబి వంశీయులకు ఘన స్వాగతం పలికే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆలయ మహాద్వారం గుండా ప్రవేశించిన అర్చకులు బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ పవిత్ర జలాన్ని శ్రీవారి నిత్య కైంకర్యాలకు సమర్పిస్తారు. శతాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ దివ్య సేవ భక్తుల హృదయాలను కదిలిస్తోంది. భయమే ఎరుగని తిరుమలనంబి వంశీయుల ఈ ఆధ్యాత్మిక యాత్రకు టిటిడి ప్రత్యేక భద్రతను కూడా కల్పిస్తోంది. ఆకాశగంగ తీర్థం నుంచి వచ్చే ప్రతి నీటి బొట్టులోనూ భక్తి, విశ్వాసం, శ్రీనివాసుడి దివ్య మహిమ దాగి ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *