Last Updated:
తిరుమలలో జేబుదొంగతనాలు, నకిలీ టీటీడీ ఐడీ కార్డుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తిరుమలకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కర్ణాటకకు చెందిన బాలాజీ అకాడే (33), మహారాష్ట్రకు చెందిన అప్పాషా మానే (65), నెల్లూరు జిల్లాకు చెందిన కల్తీ రెడ్డి కీర్తి (31) లను రాంభగీచ కార్ పార్కింగ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులు తిరుమలకు వచ్చే భక్తుల రద్దీనే అవకాశంగా మలుచుకున్నట్లు అంగీకరించారు. బాలాజీ బస్ స్టాండ్, ఉచిత బస్సులు, ఇతర రద్దీ ప్రాంతాల్లో జేబుదొంగతనాలు, పర్సుల చోరీలు, బ్యాగులను బ్లేడ్‌లతో కత్తిరించి నగదు, విలువైన వస్తువులను అపహరిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో భక్తులు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
దర్యాప్తులో మహిళా నిందితురాలి మోసం మరింత సంచలనం సృష్టించింది. ఆమె నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు తయారు చేసుకుని తాను టీటీడీ ఉద్యోగినినని నమ్మించేది. వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తానని భక్తులకు హామీ ఇచ్చి, ఫోన్‌పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ పలువురిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి ఒక దొంగిలించిన పర్సు, రూ.5,100 నగదు, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, నకిలీ టీటీడీ గుర్తింపు కార్డు, రెండు పోకో మొబైల్ ఫోన్లు, ఒక లావా సెల్‌ఫోన్, కట్టర్, చిన్న కత్తి, బ్లేడ్‌లు, గిల్ట్ నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న వస్తువులను జప్తు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. గతంలో కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు వారి పూర్తి నేర చరిత్రపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీవీ అండ్ ఎస్‌ఓ మురళీకృష్ణ భక్తులకు కీలక సూచనలు చేశారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామని చెప్పే అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. టీటీడీ సేవలను అధికారిక కౌంటర్లు, అధికారిక వెబ్‌సైట్, అధికారిక మార్గాల ద్వారానే పొందాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా మోసానికి గురైనట్లు అనిపించినా వెంటనే సమీప పోలీసులకు లేదా డయల్-112కు సమాచారం అందించాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Tirupati,Chittoor,Andhra Pradesh
Jul 27, 2026 10:12 PM IST














