తిరుమలలో భక్తుడి గదిలో చోరీ.. మాజీ శానిటేషన్ వర్కర్ అరెస్ట్.. రూ.60 వేల నగదు స్వాధీనం..! Tirumala Theft Case. | | ACTPnews

News18


Last Updated:

తిరుమల చోరీ కేసు ఛేదన: రూ.60 వేల నగదు స్వాధీనం, నిందితుడు ఉప్పు గోవర్ధన్ అరెస్ట్. భక్తులకు పోలీసులు కీలక సూచనలు.

News18
News18

తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడి వసతి గదిలో జరిగిన చోరీ కేసును తిరుమల టూ టౌన్ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తిరుపతి రూరల్ మండలానికి చెందిన ఉప్పు గోవర్ధన్ (25)ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో తిరుమలలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన అతడు తనకు తెలిసిన సమాచారాన్నే ఈ చోరీకి ఉపయోగించుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

జూలై 6న జార్ఖండ్‌కు చెందిన ఓ భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చి, ఏఎన్‌సీ వసతి సముదాయంలోని 414-ఈ గదిలో బస చేశారు. అనంతరం గదికి తాళం వేసి దర్శనానికి వెళ్లగా, అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి కిటికీ నుంచి గదిలోకి ప్రవేశించి సుమారు రూ.95 వేల నగదును అపహరించాడు. దర్శనం ముగించుకుని తిరిగి వచ్చిన బాధితుడు నగదు చోరీకి గురైనట్లు గుర్తించి వెంటనే తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తిరుపతి జిల్లా ఎస్పీ రాజశ్రీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను నిశితంగా పరిశీలించాయి. విచారణలో నిందితుడు ఉప్పు గోవర్ధన్‌గా గుర్తించిన పోలీసులు జూలై 9న తిరుమలలోనే అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో గతంలో రెండు నెలల పాటు శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన సమయంలో వసతి గదుల నిర్మాణం, భద్రతా ఏర్పాట్లపై అవగాహన పెంచుకుని, అదే సమాచారంతో ఈ చోరీకి పాల్పడినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.

అరెస్ట్ అనంతరం నిందితుడి వద్ద నుంచి రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేశారు.

వసతి గదుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువులను ఉంచి బయటకు వెళ్లవద్దని పోలీసులు సూచించారు. దర్శనానికి వెళ్లే ముందు గదుల తలుపులు, కిటికీలు పూర్తిగా లాక్ అయ్యాయో లేదో తప్పనిసరిగా పరిశీలించాలని, అనుమానాస్పదంగా ఎవరైనా సంచరిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవ 112కు సమాచారం అందించాలని కోరారు. చిన్నపాటి అప్రమత్తతతో ఇలాంటి చోరీ ఘటనలను సమర్థవంతంగా నివారించవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports