Last Updated:
కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో సీజేపీకి కీలక హామీలు దక్కాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు సమయం కోరింది. అప్పటివరకు జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ ప్రకటించింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి, కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) నేతలకు మధ్య శుక్రవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో సీజేపీ ప్రతినిధులు 3 డిమాండ్లను ఉంచారు. తమ ప్రధాన డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు.. నీట్ పేపర్ లీక్ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, ఆందోళనకారులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని వారు కోరారు.
ఐతే కేంద్ర మంత్రి రాజీనామా అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరినట్లు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియాకు వెల్లడించారు. కేంద్ర మంత్రి రాజీనామా మినహా మిగిలిన రెండు అంశాలకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు వారు స్పష్టం చేశారు.
#WATCH | Delhi: A meeting held between Union Ministers JP Nadda and Jitendra Singh, and Cockroach Janta Party’s Chief Spokesperson Saurav Das and its National Spokesperson Ashutosh Ranka. pic.twitter.com/AYMu9RD8d8
— ANI (@ANI) July 24, 2026
కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ, మంత్రి రాజీనామా చేయాల్సిందేనన్న పట్టుదల నుంచి సీజేపీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ధర్మేంద్ర ప్రధాన్ వ్యవహారంలో ఎలాంటి రాజీకి తావులేదని తాము మంత్రులకు తేల్చిచెప్పినట్లు సౌరవ్ దాస్ పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం మరోసారి ప్రభుత్వంతో సమావేశం కానున్నామని, ప్రభుత్వం నుంచి అధికారికంగా స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు జంతర్ మంతర్ వద్ద తమ శాంతియుత నిరసనలు యథాతథంగా కొనసాగుతాయని సీజేపీ స్పష్టం చేసింది. నేడు దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మె సైతం ఆగదని ప్రకటించింది.
ఈ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల మూడు ప్రధాన డిమాండ్లతో పాటు పరీక్షా విధానంలో తీసుకురావాల్సిన ఐదు ముఖ్యమైన సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. CJPతో రెండు గంటలపాటు చర్చలు జరిపామని.. శనివారం మధ్యాహ్నం సీజేపీ నేతలతో మళ్లీ సమావేశమై ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తామని ఆయన చెప్పారు.
మరోవైపు, విద్యా వ్యవస్థలో మార్పులు కోరుతూ 26 రోజులుగా నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్, కేంద్ర మంత్రుల నుంచి రాతపూర్వక హామీ అందుకున్న తర్వాతే గురువారం రాత్రి దీక్ష విరమించారు. ఆ వెంటనే ఆందోళనకారులతో ప్రభుత్వం లాంఛనప్రాయంగా చర్చలకు రావడం విశేషం.
జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. యువ నేత అభిజీత్ డిప్కే ఆధ్వర్యంలో వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిల భారత స్థాయిలో జరుగుతున్న ఈ నిరసనల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పేపర్ లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేబినెట్ కొత్త చట్టానికి ఆమోదం తెలిపినప్పటికీ, విద్యాశాఖ మంత్రి రాజీనామా అంశం మోదీ ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. విద్యార్థుల ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు కేంద్రం శనివారం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














