Last Updated:
NEET-UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేపట్టింది. 47 మంది అధికారులను తొలగించడంతో పాటు సంస్థలో సమగ్ర సంస్కరణలు, ఔట్‌సోర్సింగ్ విధానంలో మార్పులు, లీక్‌ప్రూఫ్ పరీక్షల వ్యవస్థ ఏర్పాటు, జవాబుదారీతనం పెంపుపై కీలక చర్యలు ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ స్థాయిలో ప్రక్షాళన ప్రారంభించింది. ఈ క్రమంలో శుక్రవారం 47 మంది అధికారులను విధుల నుంచి తొలగించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వీరిలో కొందరిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇటీవల జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీయడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీఏ పనితీరును సమగ్రంగా సమీక్షిస్తోంది. సంస్థలో జవాబుదారీతనం పెంచడంతో పాటు పరీక్షల నిర్వహణలో ఉన్న బలహీనతలను తొలగించేందుకు విస్తృత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. వచ్చే నెల రోజుల్లో ఎన్‌టీఏ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.
ఈ సంస్కరణల్లో ముఖ్యంగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఔట్‌సోర్సింగ్ విధానంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను సమూలంగా మార్చి, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయడం, జవాబుదారీతనాన్ని పెంచడం, పరీక్షల నిర్వహణలో ఉండే లోపాలను నివారించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. నిపుణుల కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ మార్పులు అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
పేపర్ లీక్‌లకు పూర్తిగా అడ్డుకట్ట వేసేలా సాంకేతిక, పరిపాలనా పరమైన సంస్కరణలను కూడా ప్రభుత్వం తీసుకురానుంది. పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయడం, ప్రతి దశలో పారదర్శకతను పెంచడం, సంస్థ పనితీరును మరింత సమర్థవంతంగా మార్చడం ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయి.
ముఖ్యంగా NEET-UG 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల అనంతరం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల విశ్వసనీయతను పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏలో చేపడుతున్న మార్పులు సంస్థ పనితీరును పూర్తిగా మార్చే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. భవిష్యత్తులో జాతీయ స్థాయి పరీక్షల భద్రతను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల్లో విశ్వాసాన్ని పెంచడమే కేంద్రం ప్రధాన లక్ష్యంగా పేర్కొంటోంది.
ప్రస్తుతం ఎన్‌టీఏ దేశవ్యాప్తంగా JEE, NEET, CUET సహా 15 నుంచి 20 జాతీయ స్థాయి ప్రవేశ, నియామక పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ పరీక్షల నిర్వహణను మరింత విశ్వసనీయంగా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
ఇక NEET-UG 2026 పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు ఢిల్లీలో చేపట్టిన భారీ నిరసనల అనంతరం ఈ వ్యవహారం జాతీయ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, భద్రంగా మార్చే దిశగా సంబంధిత శాఖలతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana














