Last Updated:
తిరుమల పోలీసులు రూ.8 లక్షల విలువైన బంగారు తాళిబొట్టును సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి భక్తురాలికి అప్పగించారు. పోలీసులు అప్రమత్తతను ప్రశంసించారు.
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల భద్రత, వారి విలువైన వస్తువుల సంరక్షణలో తిరుమల పోలీసులు మరోసారి తమ అప్రమత్తతను నిరూపించారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన శ్రీమతి పద్మావతి సుమారు రూ.8 లక్షల విలువైన 50 గ్రాముల బంగారు తాళిబొట్టు పోగొట్టుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తిరుమల టూ టౌన్ పోలీసులు వెంటనే స్పందించి, సీసీ కెమెరాల సహాయంతో విలువైన ఆభరణాన్ని గుర్తించి భక్తురాలికి సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనతో పోలీసుల సేవాభావంపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
శ్రీమతి పద్మావతి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రైవేట్ వాహనంలో తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనానికి వెళ్లే సమయంలో తమ వద్ద ఉన్న బ్యాగ్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.8 లక్షల విలువైన 50 గ్రాముల బంగారు తాళిబొట్టు ఉండటంతో వెంటనే తిరుమల టూ టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్ సహాయంతో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజ్ ఆధారంగా భక్తురాలు ప్రయాణించిన ప్రైవేట్ వాహనాన్ని గుర్తించి వెంటనే తనిఖీ చేయగా, అందులో పోయిన బ్యాగ్‌తో పాటు రూ.8 లక్షల విలువైన బంగారు తాళిబొట్టు సురక్షితంగా లభించింది. అనంతరం పోలీసులు ఆ బ్యాగ్‌ను ఎలాంటి నష్టం జరగకుండా భక్తురాలికి అప్పగించారు.
విలువైన బంగారు ఆభరణం తిరిగి లభించడంతో శ్రీమతి పద్మావతి, ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వేగంగా స్పందించి తమ విలువైన వస్తువును తిరిగి అందించిన తిరుమల టూ టౌన్ పోలీసులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బందికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల అప్రమత్తత, సేవా దృక్పథం కారణంగానే తమకు ఎంతో విలువైన ఆభరణం తిరిగి దక్కిందని చెప్పారు.
ఈ ఘటనపై స్పందించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., విధి నిర్వహణలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. తిరుమలకు వచ్చే భక్తులు తమ విలువైన వస్తువులను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సంరక్షించుకోవాలని, ఏవైనా వస్తువులు పోయినా లేదా ఇతర ఇబ్బందులు ఎదురైనా వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బంది లేదా టీటీడీ విజిలెన్స్ అధికారులను సంప్రదించాలని సూచించారు. భక్తుల భద్రత, వారి ఆస్తుల రక్షణే తమ తొలి ప్రాధాన్యమని, తిరుమల పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా సేవలందిస్తూనే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.
Tirupati,Chittoor,Andhra Pradesh
Jul 24, 2026 10:36 PM IST














