Last Updated:
హైదరాబాద్‌లో బక్రీద్ ప్రార్థనల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు భారీ ఆంక్షలు విధించారు. పలు రూట్లను మళ్లించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి.
పండుగ పూట ట్రాఫిక్ కష్టాలు వద్దు.. ముందస్తు ప్రణాళికతో ప్రయాణాలు సాగించండి. బక్రీద్ ప్రార్థనల వేళ భాగ్యనగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలి. హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. మే 28 గురువారం నాడు పవిత్ర బక్రీద్ (ఈద్ అల్-అధా) పండుగను పురస్కరించుకుని మీర్ ఆలం ట్యాంక్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు భారీ ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రార్థనలకు వెళ్లే వారితో పాటు సాధారణ వాహనదారులు సైతం ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ప్రార్థనలు ముగిసి, జనం పూర్తిగా ఇళ్లకు వెళ్లే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.
పురానాపూల్, కామాటిపుర, కిషన్‌బాగ్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను బహదూర్‌పురా క్రాస్ రోడ్స్ గుండా మాత్రమే అనుమతిస్తారు. సాధారణ వాహనాలను ఈద్గా, తడ్‌బన్ వైపు అనుమతించరు. వీటిని జూపార్క్ నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. నమాజ్ కోసం వచ్చే వారికి జూపార్క్ గోడ పక్కన ఉన్న పార్కింగ్ ప్రాంతంలో, మస్జిద్ అల్లా-హో-అక్బర్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ వాహనాలను పురానాపూల్ నుంచి బహదూర్‌పురా వైపు రాకుండా జియాగూడ, సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. బహదూర్‌పురా, శంషాబాద్, రాజేంద్రనగర్ మధ్య తిరిగే భారీ వాహనాలు ఫ్లైఓవర్ పైనుంచే వెళ్లాలి.
శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ క్రాస్ రోడ్స్ గుండా అనుమతిస్తారు. ఇటు వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను శాస్త్రీపురం, ఎన్ఎస్ కుంట వైపు మళ్లిస్తారు. సుఫీ కార్స్ నుంచి మోడరన్ పెట్రోల్ బంక్ వరకు సింగిల్ లైన్ పార్కింగ్‌కు అవకాశం కల్పించారు. కాలాపత్తర్ వైపు నుంచి వచ్చే వాహనాలకు కాలాపత్తర్ ఎల్ అండ్ ఓ పోలీస్ స్టేషన్ గుండా అనుమతి ఉంటుంది. సాధారణ ట్రాఫిక్‌ను మోచి కాలనీ, బహదూర్‌పురా, నవాబ్ సాహెబ్ కుంట వైపు మళ్లిస్తారు. మాస్ మెటీరియల్ షాప్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.
బక్రీద్ పండుగ సందర్భంగా జంతువుల కొనుగోలు, అమ్మకాల రద్దీని దృష్టిలో ఉంచుకుని మే 28 తేదీన నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు అడ్వైజరీ జారీ చేశారు. టోలిచౌకి, నానల్ నగర్, రేతిబౌలి మార్గంలో, రేతిబౌలి నుంచి అత్తాపూర్ వెళ్లే రోడ్డులో జంతువుల విక్రయాలతో విపరీతమైన రద్దీ ఉంటుంది. అందుకే సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తారు. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లడం ఉత్తమం.
రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి మెహిదీపట్నం వైపు వచ్చే వాహనదారులు ఫిల్మ్ నగర్ రోడ్డు, బృందావన్ కాలనీ రోడ్డును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. లక్డీకాపూల్ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు మాసబ్ ట్యాంక్ జంక్షన్, బంజారాహిల్స్ మీదుగా వెళ్లాలి. ముఖ్యంగా ప్రైవేట్ బస్సులు రాత్రి వేళల్లో మెహిదీపట్నం-టోలిచౌకి మార్గంలో అస్సలు ప్రయాణించకూడదని పోలీసులు స్పష్టం చేశారు. వాటికి బదులుగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) గుండా ప్రయాణించాలని యాజమాన్యాలకు గట్టిగా సూచించారు. ప్రయాణికులు ఈ ట్రాఫిక్ ఆంక్షలను గమనించి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.
Hyderabad,Hyderabad,Telangana













