టుడే టాప్ 10 న్యూస్.. రాజకీయాలు, క్రైమ్, అంతర్జాతీయం, సినిమా అప్‌డేట్స్ | | ACTPnews

టాప్ 10 న్యూస్ టుడే


Last Updated:

తెలుగు రాష్ట్రాల ప్రధాన వార్తలతోపాటు జాతీయ, అంతర్జాతీయ తాజా అంశాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం…

టాప్ 10 న్యూస్ టుడే
టాప్ 10 న్యూస్ టుడే

ఈరోజు టాప్ 10 ప్రధాన వార్తల్లో తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ వ్యాఖ్యలు, ఏపీ ‘మనమిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్‌లో వాయిస్ ఫిర్యాదు సేవ, మూసీ ప్రాజెక్ట్ బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, కవిత ఎన్నికల సంఘంపై ఆరోపణలు, అమర్‌నాథ్ యాత్ర తొలి పూజ, కేతన్ అగర్వాల్ కేసు, ఫ్రాన్స్ విమాన ప్రమాదం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రికార్డు, ‘ఈ నగరానికి ఏమైంది 2’ విడుదల తేదీ వంటి తాజా విశేషాలు ఉన్నాయి.

1. తెలంగాణలో వచ్చేది మన ప్రభుత్వమే..

తెలంగాణ సమగ్రాభివృద్ధి బీజేపీ ‘డబుల్ ఇంజిన్ సర్కార్’తోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ నేత నితిన్ నబీన్ అన్నారు. వరంగల్, భువనగిరి పర్యటనల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉపాధి, అభివృద్ధి హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

2. వాట్సాప్ వాయిస్‌ మెసేజ్‌లు కూడా ఫిర్యాదులుగా స్వీకరించాలి

ఏపీలో ప్రజల సమస్యల తక్షణ పరిష్కారానికి వాట్సాప్‌ ‘మనమిత్ర’ ద్వారా ఆన్‌లైన్‌, వాయిస్ మెసేజ్ ఫిర్యాదులను కూడా స్వీకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం ప్రతినెలా సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఓడీలు 6 రోజులు, కలెక్టర్లు 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చెప్పారు. ఈ మేరకు అధికారులు ఒక సర్క్యులర్ జారీ చేశారు.

3. మూసీ ప్రాజెక్ట్‌లో ఇళ్లు కోల్పోయే వారికి గుడ్‌ న్యూస్

మూసీ ప్రాజెక్టు భూసేకరణ వల్ల ఎవరికీ అన్యాయం జరగనివ్వమని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. అధికారులు మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే పేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తామన్నారు. భూములు కోల్పోయేవారికి పరిహారం, పునరావాసం కల్పించడంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు.

4. ఎన్నికల సంఘంపై కవిత సంచలన ప్రశ్నలు!

కొడంగల్ నియోజకవర్గంలో 33 వేల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని కవిత ఆరోపించారు. గత ఏడాదిన్నర కాలంగా కేవలం 808 ఓట్లను మాత్రమే ఎందుకు తొలగించారని ఆమె ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. అదే సమయంలో బోధన్ నియోజకవర్గంలో మాత్రం ఏకంగా 7 వేల ఓట్లను ఎలా తొలగించారో చెప్పాలన్నారు. ఈ రెండు అంశాలపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

5. అమర్‌నాథ్‌ క్షేత్రంలో తొలి పూజ..

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇవాళ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుహలోని మంచు లింగానికి ఆయన తొలి పూజ నిర్వహించారు. జులై 3 నుంచి ఆగస్టు 28 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. భక్తుల రక్షణ కోసం సైన్యం, పోలీసులు, భద్రతా దళాలు పూర్తి సమన్వయంతో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

6. కేతన్‌ నుంచి రూ.కోటి తీసుకొని ప్రియుడికి ఇచ్చిన సియా..!

పుణె యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితురాలు సియా పెళ్లి షాపింగ్ నెపంతో కేతన్ నుండి రూ.కోటి వసూలు చేసింది. ఆ భారీ మొత్తాన్ని తన ప్రియుడు చేతన్‌కు అందజేసింది. కేతన్‌ను హతమార్చిన కొన్నేళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలనే ప్లాన్‌తోనే వారు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు గుర్తించారు.

7. తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా?

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రహస్య ప్రాంతం నుండి దేశాన్ని నడిపిస్తున్న ఆయన కుమారుడు మొజ్తాబా ఖమేనీ వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో జరిగిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ నిఘా కంటికి చిక్కకుండా చికిత్స పొందుతున్న ఆయన ఈ వేడుకకు హాజరవుతారా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

8. ఫ్రాన్స్ విమాన ప్రమాదంలో 11 మంది మృతి

ఫ్రాన్స్‌లోని టోంబ్లేన్ పట్టణంలో ఒక ఘోర విమాన ప్రమాదం జరిగింది. పారాచూట్ శిక్షణ ఇస్తున్న విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు ఐదుగురు విద్యార్థులు, ఐదుగురు శిక్షకులు అక్కడికక్కడే మరణించారు. ఈ విషాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్థానిక అధికారులు ప్రమాద కారణాలపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు.

9. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ ‘జయ జానకి నాయక’.. సరికొత్త రికార్డ్‌

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రం అరుదైన రికార్డు సృష్టించింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ‘ఖూన్‌ఖార్’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలయింది. తాజాగా ఈ చిత్రం 100 కోట్ల (1 బిలియన్) వ్యూస్ సాధించింది. టాలీవుడ్‌లో యూట్యూబ్‌లో ఈ అద్భుత మైలురాయిని అందుకున్న ఏకైక తెలుగు హీరో సినిమాగా ఇది నిలిచింది.

10. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌ రిలీజ్‌ ఎప్పుడంటే!

తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర సీక్వెల్‌ ‘ENE రిపీట్‌’ (ENE2) విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. విశ్వక్‌సేన్‌, అభినవ్‌ ప్రధాన పాత్రల్లో ఈ క్రేజీ సీక్వెల్‌ రానుంది. ఈ ఏడాది నవంబర్‌ 19న సినిమాను విడుదల చేయనున్నట్లు ఒక ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports