షేక్ హసీనా రీఎంట్రీ చర్చల మధ్య బంగ్లా అధ్యక్షుడి రాజీనామా.. అసలు కారణం ఇదేనా? | | ACTPnews

News18


Last Updated:

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ రాజీనామాతో ఆ దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

News18
News18

మాజీ ప్రధాని షేక్ హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి మరో కీలక మలుపు తిరిగింది. రెండు ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ పరిణామాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షహాబుద్దీన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. పీటీఐ కథనం ప్రకారం, ఈ విషయాన్ని ఆయనకు సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి.

2023 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన షహాబుద్దీన్ పదవీకాలం 2028 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ, మధ్యలోనే వైదొలిగారు. బంగ్లాదేశ్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం తన రాజీనామా పత్రాన్ని జాతీయ అసెంబ్లీ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్కు సమర్పించారు. ఇటీవల వైద్య చికిత్స అనంతరం థాయ్‌లాండ్ నుంచి ఆయన తిరిగి వచ్చారు.

రాజీనామా కారణంపై స్పందించిన షహాబుద్దీన్, తాను అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ప్రస్తుతం అంతకుమించి వ్యాఖ్యానించలేనని చెప్పారు. అయితే బంగ్లాదేశ్ మీడియా కథనాలు, రాజకీయ విశ్లేషణలు మాత్రం ఈ నిర్ణయం వెనుక ఆరోగ్య కారణాల కంటే రాజకీయ ఒత్తిడే ప్రధాన కారణమై ఉండొచ్చని సూచిస్తున్నాయి.

అవామీ లీగ్‌తో అనుబంధం, పెరిగిన రాజకీయ ఒత్తిడి

1971 బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న షహాబుద్దీన్, దిగువ న్యాయస్థానాల్లో న్యాయమూర్తిగానూ సేవలందించారు. 2023లో అవామీ లీగ్‌కు పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్న సమయంలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనలు, హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్‌కు వెళ్లిన తర్వాత కూడా పాత రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగిన ప్రముఖ నాయకుడిగా షహాబుద్దీన్ నిలిచారు.

ఆయన పదవిలో ఉన్న సమయంలోనే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే యూనస్ ప్రభుత్వం, అధ్యక్షుడి మధ్య ప్రారంభం నుంచే విభేదాలు ఉన్నట్లు సమాచారం. విదేశీ రాయబార కార్యాలయాల నుంచి తన చిత్రాలను తొలగించడం వంటి పరిణామాల వల్ల తాను అవమానానికి గురయ్యానని షహాబుద్దీన్ గతంలో వ్యాఖ్యానించారు.

షేక్ హసీనాతో సంప్రదింపులే వివాదానికి కారణమా?

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రథమ్ ఆలో, డైలీ స్టార్ పత్రికల కథనాల ప్రకారం, షహాబుద్దీన్ రాజీనామా వెనుక రాజకీయ పరిణామాలు కీలక పాత్ర పోషించాయి. మే నెలలో వైద్య చికిత్స కోసం లండన్ వెళ్లిన సమయంలో భారత్‌లో ఆశ్రయం పొందిన మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆయన రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు నిఘా సంస్థలకు సమాచారం అందినట్టు నివేదికలు పేర్కొన్నాయి. ఇటీవల కూడా హసీనాతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరిగాయని తాత్కాలిక ప్రభుత్వానికి నివేదికలు చేరినట్లు వెల్లడించాయి.

ఈ సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం అధ్యక్షుడికి పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టమైన సందేశం పంపినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది. ముఖ్యంగా బీఎన్‌పీ మద్దతు ఉన్న వర్గాలు ఆయన కొనసాగితే షేక్ హసీనా అనుచరులకు పరోక్ష మద్దతు లభించే అవకాశం ఉందని భావించినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఇదే సమయంలో రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేక్ హసీనా, తాను మరియు అవామీ లీగ్ నేతలు ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్ నుంచి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి కోర్టు ఎదుట లొంగిపోతామని ప్రకటించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం 2024 విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసిన కేసుల్లో ఆమెపై విచారణ కొనసాగుతుండగా, అవామీ లీగ్ కార్యకలాపాలపై నిషేధం అమల్లో ఉంది.

రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం

బంగ్లాదేశ్‌లో అధ్యక్ష పదవి ప్రధానంగా లాంఛనప్రాయమైనదే అయినప్పటికీ, సంక్షోభ సమయంలో దానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం అధ్యక్షుడు లిఖితపూర్వక రాజీనామాను పార్లమెంట్ స్పీకర్‌కు సమర్పించాలి. రాజీనామా, మరణం లేదా ఇతర కారణాలతో పదవి ఖాళీ అయితే 90 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడిని పార్లమెంట్ సభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం రాజకీయ సమీకరణాల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ప్రభావం ఎక్కువగా ఉండటంతో, తదుపరి అధ్యక్షుడిగా ఆ పార్టీకి చెందిన నాయకుడు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports