Last Updated:
శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో, రాష్ట్ర అధికార కూటమిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎగువ సభ స్థానాల కోసం తెలుగుదేశం పార్టీలోనే ఆశావహుల పోటీ అత్యంత తీవ్రంగా ఉందని, అందువల్ల ఈ విడతలో భారతీయ జనతా పార్టీ (BJP) కి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆ పార్టీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్ కలిసి ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో రాజ్యసభ సీట్ల కేటాయింపుతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈనాడు కథనం ప్రకారం.. రాష్ట్రం నుండి జూన్ నెలాఖరుకు ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో.. అసెంబ్లీలో ఉన్న బలబలాల ప్రకారం కూటమి అన్ని స్థానాలనూ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూటమి భాగస్వామిగా ఉన్న తమకు ఒక స్థానాన్ని కేటాయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సీఎం చంద్రబాబును అధికారికంగా కోరారు. అయితే, దీనిపై చంద్రబాబు అత్యంత సున్నితంగా నిరాకరించినట్లు సమాచారం. గత ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా రాజ్యసభ స్థానాన్ని ఆశిస్తున్నారని, పార్టీ అంతర్గత అవసరాల రీత్యా ఈసారి బీజేపీకి సీటు కేటాయించడం కుదరదని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది.
ఈ భేటీలో రాజ్యసభ స్థానంతో పాటు రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్, పంచాయతీ వంటి స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఇరు పార్టీల నేతలు క్షుణ్ణంగా చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి గౌరవప్రదమైన స్థానాలను కేటాయించాలని, ముందే సీట్ల సర్దుబాటు ముగించాలని మాధవ్ కోరారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ.. రాబోయే సెప్టెంబరు నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని క్లూ ఇచ్చారు. సీట్ల కేటాయింపులో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసిందనే సంఖ్య కంటే, కూటమిగా ఏయే స్థానాల్లో గెలుస్తామనే ‘గెలుపు గుర్రాల’కే (Winnaibilty) మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అభ్యర్థుల ఎంపికలో గెలుపే ఏకైక ప్రామాణికంగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పన్నెండేళ్లు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భాన్ని పురస్కరించుకుని, ఎన్డీయే (NDA) కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. జూన్ 5వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడిగా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అలాగే, అమరావతి రాజధాని పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ‘స్మృతివనం’ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపు, తదుపరి పనుల పురోగతిపై కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.
రాబోయే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చినట్లుగా.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరు మీద ఒక మొక్కను నాటే సరికొత్త కార్యక్రమాన్ని (ఏక్ పేడ్ మా కే నామ్) అధికారికంగా, విస్తృతంగా చేపట్టాలని మాధవ్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీంతో పాటు జూన్ 21న రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాలు, నగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కూటమి ప్రభుత్వం తరపున పూర్తి మద్దతు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. రాజ్యసభ సీటు దక్కకపోయినప్పటికీ, ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే ఎన్నికల్లో సమన్వయంతో ముందుకెళ్లాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













