Last Updated:
అద్భుతమైన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊపిరి పోశాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటిన తివారీ, తన జట్టును ప్లే ఆఫ్ రేసులో నిలబెట్టడమే కాకుండా, తన తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
IPL 2026: ఐపీఎల్ అంటేనే అనామక ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారే వేదిక. సరిగ్గా అదే జరిగింది సోమవారం రాత్రి ధర్మశాల మైదానంలో. తన కెరీర్‌లో కేవలం రెండో మ్యాచ్ ఆడుతున్న 22 ఏళ్ల యువ ఆల్ రౌండర్ మాధవ్ తివారీ, అద్భుతమైన ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊపిరి పోశాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ సత్తా చాటిన తివారీ, తన జట్టును ప్లే ఆఫ్ రేసులో నిలబెట్టడమే కాకుండా, తన తొలి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.
పంజాబ్ కింగ్స్ విసిరిన 211 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక దశలో తడబడింది. 8వ నంబర్ బ్యాటర్‌గా క్రీజులోకి వచ్చిన మాధవ్ తివారీ, ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వకుండా కేవలం 8 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఢిల్లీ 3 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేయడంలో ఆయన పాత్ర కీలకం.
అంతకుముందు బౌలింగ్‌లోనూ తివారీ తన విలువేంటో నిరూపించుకున్నాడు. పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య (33 బంతుల్లో 56) విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో అతడిని అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సెట్ అయిన కూపర్ కానలీని (38) కూడా పెవిలియన్‌కు పంపాడు. 4 ఓవర్లలో 40 పరుగులిచ్చినప్పటికీ, సరైన సమయంలో తీసిన ఆ రెండు వికెట్లు పంజాబ్‌ను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాయి.
మాధవ్ తివారీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇతడిని రూ. 40 లక్షలకు దక్కించుకుంది. గత ఏడాది ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ, ఆ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కేవలం 3 పరుగులకే అవుటయ్యాడు.
వాస్తవానికి ఈ సీజన్‌లో పంజాబ్‌తో మే 8న జరిగిన మ్యాచ్‌లోనే ఇతడు మళ్ళీ కనిపించాల్సి ఉంది. కానీ భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. తాజాగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో లభించిన అవకాశాన్ని తివారీ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
విశేషమేమిటంటే, మాధవ్ తివారీ ఇంకా మధ్యప్రదేశ్ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించలేదు. కానీ అండర్-19, అండర్-23 విభాగాల్లో మరియు మధ్యప్రదేశ్ టీ20 లీగ్‌లో భోపాల్ లెపర్డ్స్ తరపున ఆడుతూ అదరగొట్టాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో రేవా జాగ్వార్స్‌పై కేవలం 31 బంతుల్లో 65 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే ప్రతిభ అతడిని ఐపీఎల్ వరకు చేర్చింది.
తన గురించి తాను చెప్పుకుంటూ.. “నేను 100% బౌలర్ని, అలాగే 100% బ్యాటర్ని” అని తివారీ ధీమాగా చెబుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్ ఇయాన్ బెల్, బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ మార్గదర్శకత్వంలో తన ఆటను మెరుగుపరుచుకున్నానని తెలిపాడు.
“కోచ్ నాతో.. నీ దగ్గర పవర్ ఉంది, అనవసరంగా షాట్లు ట్రై చేయకు, బంతిని బట్టి స్పందించు అని చెప్పారు. మునాఫ్ సార్‌తో కలిసి బౌలింగ్ మీద చాలా కష్టపడ్డాను. ప్రతి ప్రాక్టీస్ సెషన్‌లో మెరుగవ్వడమే నా లక్ష్యం” అని మాధవ్ తివారీ పేర్కొన్నాడు.
ఈ యువ ఆటగాడి అద్భుత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇతడు ఇదే దూకుడు కనబరిస్తే, భారత క్రికెట్‌లో మరో మేటి ఆల్ రౌండర్ దొరికినట్లే!
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 12, 2026 10:50 AM IST













