Last Updated:
నీట్ పరీక్ష వివాదంపై కేంద్ర మంత్రి రాజీనామాను కోరుతూ ఆన్‌లైన్ పిటిషన్ ప్రారంభించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వెబ్‌సైట్ నిలిచిపోయింది. ప్రభుత్వం నియంతృత్వంతో తమ సైట్‌ను తొలగించిందని వ్యవస్థాపకుడు అభిజీత్ ఆరోపించారు.
ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) అధికారిక వెబ్‌సైట్ శనివారం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ తమ వెబ్‌సైట్‌ను తొలగించిందని ఆ డిజిటల్ ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు. యువతను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యమైన పోస్టులు, మీమ్స్ ద్వారా వ్యవస్థను విమర్శించే ఈ వినూత్న వేదికకు మిలీనియల్స్, జెన్-జీ (Gen Z) వినియోగదారులలో విపరీతమైన ఆదరణ లభించింది. వెబ్‌సైట్ అందుబాటులో లేకపోయే సమయానికి దాదాపు 10 లక్షల మంది యువకులు ఇందులో సభ్యులుగా చేరారని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇటీవల దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్-యూజీ (NEET-UG) పరీక్ష పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఈ వేదిక ద్వారా ప్రారంభించిన ఆన్‌లైన్ పిటిషన్‌పై కేవలం రెండు రోజుల్లోనే 6 లక్షల మంది సంతకాలు చేశారని దిప్కే పేర్కొన్నారు.
తమ గళాన్ని నొక్కేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ నియంతృత్వ వైఖరి దేశ యువతకు కళ్ళు తెరిపిస్తోందని ఆయన విమర్శించారు. ఒక మంచి భవిష్యత్తును డిమాండ్ చేయడమే తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. తమను అంత సులభంగా వదిలించుకోలేరని, ప్రస్తుతం కొత్త డిజిటల్ వేదికను సిద్ధం చేస్తున్నామని ‘కాక్‌రోచ్‌లు ఎప్పటికీ చనిపోవు’ అంటూ రాసుకొచ్చారు.
The government has taken down our iconic website – https://t.co/l6i6Ry8h5S.
10 Lakh cockroaches had signed up on our website has members.6 Lakh cockroaches had signed a petition to demand the resignation of Dharmendra Pradhan.
Why is the government so scared of cockroaches?…
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
అదనపు సమాచారం ప్రకారం, కేవలం ఐదు రోజుల్లోనే ఈ పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఏకంగా 20 మిలియన్ల (రెండు కోట్ల) ఫాలోవర్లను దాటి అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఖాతాల కంటే ఎక్కువ ఆదరణ పొందింది. ఈ క్రమంలో శనివారం అభిజీత్ వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు పార్టీ అధికారిక సోషల్ మీడియా పేజీలు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయని ఆయన ఆరోపించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణలో నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి వచ్చే వారిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తప్పుగా ప్రచారమవడంతో ఈ కాక్‌రోచ్ పార్టీ ట్రెండ్ ఇంటర్నెట్‌లో మొదలైంది. ఆ తర్వాత ఇది నిరుద్యోగం, పరీక్షల లీకేజీలపై యువత నిరసన తెలిపే అతిపెద్ద వేదికగా మారింది. ఇంటెలిజెన్స్ బ్యూరో జాతీయ భద్రతా కారణాలను చూపడంతో ఐటీ చట్టం సెక్షన్ 69A కింద గతంలోనే వీరి ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కూడా నిలిపివేశారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













