ప్రధాని మోదీ 76వ జన్మదినం.. దేశవ్యాప్తంగా దీపాలతో నీరాజనాలు.. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ! | | ACTPnews

News18


Last Updated:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, ఆశీస్సులకు ప్రధాని మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

News18
News18

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. కాంగ్రెసేతర ప్రధానుల్లో అత్యధిక కాలం దేశానికి సేవలందించిన రికార్డు ఆయన సొంతం. 2014 నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో వరుసగా అధికారంలో కొనసాగుతోంది. ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాయి. ఆయన జన్మస్థలమైన వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు యువత భారీ ర్యాలీ నిర్వహించింది. అయితే, ఈ వేడుకల్లో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశ ప్రగతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య ఇళ్లల్లో దీపాలు వెలిగించాలని పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీ, ఉజ్జయిని, అస్సాం, గుజరాత్ సహా అనేక నగరాల్లో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఢిల్లీలోని చారిత్రక కర్తవ్య పథ్ ‘ఆశీర్వాద్ కా దియా’ వేడుకలతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. ప్రధాని మోదీకి తమ శుభాకాంక్షలు తెలియజేసేందుకు అక్కడ ఏకంగా 1.25 లక్షల దీపాలను వెలిగించారు. ఈ అద్భుత ఘట్టంలో సామాన్య పౌరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం స్వయంగా దీపం వెలిగించి మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు.

తన పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు చూపించిన అపారమైన ప్రేమ, ఆప్యాయతలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆశీస్సులు తనను ఎంతగానో హత్తుకున్నాయని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సామాన్యులు వెలిగించిన ప్రతి దీపం, వారు పంపిన ప్రతి సందేశం.. దేశ ప్రజలకు మరింత అంకితభావంతో సేవ చేసేందుకు తనకు కొత్త బలాన్ని ఇస్తాయని స్పష్టం చేశారు.

జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేసే దిశగా అందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports