Last Updated:
2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో నిలిచేందుకు భారత్ తరపున అధికారిక ఎంట్రీ ఖరారైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
2027లో జరగనున్న 99వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) బరిలో నిలిచేందుకు భారత్ తరపున అధికారిక ఎంట్రీ ఖరారైంది. ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ (Best International Feature Film) విభాగంలో ప్రాతినిధ్యం వహించేందుకు మరాఠీ థ్రిల్లర్ చిత్రం ‘గోంధల్’ (Gondhal) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఎన్నో భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలను వెనక్కి నెట్టి విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ మరాఠీ చిత్రం ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.
ఆస్కార్ ఎంట్రీ కోసం ఈ ఏడాది దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన మొత్తం 33 చిత్రాలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్యూరీ ఈ చిత్రాలన్నింటినీ క్షుణ్ణంగా వీక్షించి, విశ్లేషించింది. ఈ జాబితాలో బాలీవుడ్ (హిందీ) నుంచి అత్యధికంగా 14 సినిమాలు ఉండగా, మరాఠీ, తెలుగు, గుజరాతీ భాషల నుంచి నాలుగు చొప్పున చిత్రాలు పరిశీలనకు వచ్చాయి. అలాగే తమిళం నుంచి మూడు, మలయాళం, నాగమీస్ భాషల నుంచి ఒక్కో సినిమా, వీటితో పాటు ఒక మూకీ చిత్రం కూడా బరిలో నిలిచాయి.
టాలీవుడ్ నుంచి ‘సింగ్ గీతం’, ‘పెద్ది’, ‘ఇరుముడి’, ఇంకా విడుదల కావాల్సిన ‘ఇగ్వా’ చిత్రాలు కమిటీ స్క్రీనింగ్‌కు వెళ్లాయి. ఇక హిందీ నుంచి అగ్ర తారలు నటించిన ‘120 బహదూర్’, ‘బోర్డర్ 2’, ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’, ‘ఇక్కీస్’ తో పాటు ఇటీవల బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘హనుమాన్ అంశ్’ లాంటి భారీ చిత్రాలను జ్యూరీ పరిశీలించింది. కానీ, ఈ కమర్షియల్ చిత్రాలన్నింటినీ పక్కనపెట్టి, అద్భుతమైన స్క్రీన్ ప్లే, కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన మరాఠీ థ్రిల్లర్ ‘గోంధల్’కే జ్యూరీ సభ్యులు ఓటు వేశారు. ప్రాంతీయ సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా సత్తా చాటుతున్నాయో ఈ ఎంపిక మరోసారి నిరూపించింది.
గతేడాది ఆస్కార్‌కు భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ‘హోమ్‌బౌండ్’ చిత్రం ఎంపికైన విషయం తెలిసిందే. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో కోవిడ్ మహమ్మారి నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా అద్భుతమైన నటన కనబరిచారు. అయితే, ఎన్నో అంచనాలతో వెళ్లిన ఆ చిత్రం కనీసం ఆస్కార్ లాంగ్ లిస్ట్‌లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో, అత్యుత్తమ థ్రిల్లర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ‘గోంధల్’ చిత్రం ఈసారి ఆస్కార్ వేదికపై నామినేషన్స్ సాధించి, దేశానికి అవార్డును తీసుకువస్తుందేమో వేచి చూడాలి.














