గరుడసేవ కోసం తిరుమలకు చేరిన గోదాదేవి మాలలు.. ఈ పూలమాలల వెనుక ఇంత ప్రత్యేకత ఉందా..! Tirumala Garuda Seva. | | ACTPnews

News18


Last Updated:

శ్రీవారి గరుడసేవకు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలలు..!

+

News18

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారికి అలంకరించే గోదాదేవి పుష్పమాలలు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి తీసుకొచ్చిన ఈ మాలలను ముందుగా తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉన్న శ్రీ పెద్దజీయర్ మఠానికి తీసుకువచ్చారు.

శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గోదాదేవి మాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ మాలలను మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. గరుడసేవ సందర్భంగా ఈ పుష్పమాలలను శ్రీమలయప్పస్వామివారికి అలంకరించనున్నారు.

ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ పుష్పమాలలను ఆండాళ్ మాల, శిఖామణి మాలగా పిలుస్తారు. శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు తరతరాలుగా ఈ మాలలను సంప్రదాయబద్ధంగా తయారు చేసి సమర్పిస్తున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. దీంతో గరుడసేవలో ఈ మాలలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.

శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలను గరుడసేవ రోజున శ్రీవారికి అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయంగా చెబుతారు. ఈ సంప్రదాయం వెనుక గోదాదేవి భక్తికి సంబంధించిన పురాణ కథనం ఉంది. శ్రీరంగమన్నార్ స్వామివారికి పుష్పకైంకర్యం చేసిన శ్రీ పెరియాళ్వార్ కుమార్తె గోదాదేవి.. స్వామివారిపై ఉన్న అపారమైన భక్తితో పుష్పమాలను ముందుగా తాను ధరించి, అనంతరం స్వామివారికి సమర్పించేవారని భక్తుల విశ్వాసం.

గోదాదేవి భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమె ధరించిన పుష్పమాలలనే స్వీకరించేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే గోదాదేవి మాలలకు వైష్ణవ సంప్రదాయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని భక్తులు భావిస్తారు. గోదాదేవిని శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా కూడా పరిగణిస్తారు.

ఇలా శ్రీవిల్లిపుత్తూరు నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఆండాళ్, శిఖామణి మాలలు ఇప్పుడు తిరుమల శ్రీవారి గరుడసేవకు సిద్ధమయ్యాయి. సంప్రదాయం, భక్తి, పుష్పకైంకర్యంతో ముడిపడిన ఈ మాలలను గరుడసేవ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారికి అలంకరించనున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports