Last Updated:
Hyderabad: వాస్తవాల కంటే తప్పుడు సమాచారమే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈవిషయాన్ని ఫాలోవర్స్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా నిర్వాహకులు కూడా తెలుసుకోవాలి. కొందరు వ్యాపారులు తమ బిజినెస్ క్యాంపెయిన్ కోసం వేసిన ఉచ్చులో పడిపోతున్నాయి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, ప్రముఖ టీవీ ఛానళ్లు.
Hyderabad: వాస్తవాల కంటే తప్పుడు సమాచారమే సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. ఈవిషయాన్ని ఫాలోవర్స్ మాత్రమే కాదు.. సోషల్ మీడియా నిర్వాహకులు కూడా తెలుసుకోవాలి. కొందరు వ్యాపారులు తమ బిజినెస్ క్యాంపెయిన్ కోసం వేసిన ఉచ్చులో పడిపోతున్నాయి సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్, ప్రముఖ టీవీ ఛానళ్లు. వీళ్లతో పాటు యూట్యూబర్స్ అంతకు మించి అన్నట్లుగా తప్పుడు వార్తలను ఎలాంటి ఆధారాలు లేకపోయినా వాస్తవాలుగా చూపించి ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ బేగంబజార్లో గోల్డెన్ గణేష్ పేరుతో ఫీల్ఖానాలో కొలువుదీరిన ‘లీ చీ కా రాజా గణేశ్–2026’ అనే ఓ జువెలరీ షాపు యజమాని 48 కిలోల పంచలోహాలతో తయారు చేసి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పూత పూశారని, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో అలంకరించినట్లుగా చెప్పడంతో సోషల్ మీడియా నిర్వాహకులు ఆ వార్తను నిర్ధారణ చేసుకోకుండా అందరూ ప్రచారం చేశారని తేల్చారు. ఇదంతా వ్యాపార ప్రచారం కోసమే నిర్వాహకులు దిగజారినట్లుగా గుర్తించారు.
బేగంబజార్ ఫీల్ఖానాలో కొలువుదీరిన ‘లీ చీ కా రాజా గణేశ్–2026’ విగ్రహంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని గోషామహల్ పోలీసులు స్పష్టం చేశారు. ఈ విగ్రహాన్ని 48 కిలోల పంచలోహాలతో తయారు చేసి, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పూత పూశారని, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో అలంకరించారని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పారు. కేవలం వ్యాపార ప్రచారం కోసం ప్రజలకు తమ జువెలరీ షాపు తెలియాలనే ఓ స్వార్ధపూరితమైన ఆలోచనతోనే ఈ తప్పుడు వార్తను మీడియాలో స్ప్రెడ్ చేశారని తెలిపారు.
గణేశ్ నవరాత్రుల సందర్భంగా ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. కొన్ని నివేదికలు దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుందని పేర్కొనడంతో ఈ వార్త మరింత వైరల్ అయింది. ఒకటి రెండు కాదు లోకల్ మీడియా ఛానళ్ల దగ్గర నుంచి యూట్యూబ్, నేషనల్ ఛానల్స్ వరకు ఈ అవాస్తమైన వార్తకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రజల్ని, నెటిజన్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా పరోక్షంగా సదరు వ్యాపారస్తునికి మేలు చేసినట్లుగా గుర్తించారు పోలీసులు.
ఈ ప్రచారంపై లోతుగా విచారణ చేపట్టిన గోషామహల్ పోలీసులు అసలు వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, వార్తల్లో చూపిస్తున్నట్లుగ గణేష్ విగ్రహాన్ని బంగారం, వజ్రాలతో తయారు చేయలేదని నిర్ధారించినట్లుగా గోషామహల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.శ్రావణ్ కుమార్ చెప్పారు. ‘లీ చీ పెర్ల్స్ అండ్ జ్యువెల్స్’ అనే తమ వ్యాపార సంస్థకు ఉచిత ప్రచారం కల్పించుకోవడం కోసమే ఆర్థిక లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారని పోలీసులు తేల్చారు.
అయితే ఈ ఆరోపణలపై దుకాణ యజమాని ఆదర్ అగర్వాల్ స్పందిస్తూ తాము ఎలాంటి అతిశయోక్తి ప్రకటనలు చేయలేదని తెలిపారు. ఈ వైరల్ ప్రచారం వల్ల తమ కుటుంబానికి భద్రతాపరమైన సమస్యలు తలెత్తాయని, రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను ఆశ్రయించినట్లు ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో, ప్రజలు ఎలాంటి ఆధారాలు లేని వార్తలను, ఫొటోలను గుడ్డిగా నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేసి అనవసర గందరగోళం సృష్టించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేశ్ ఉత్సవాల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అధికారికంగా ధ్రువీకరించిన సమాచారాన్నే విశ్వసించాలని పోలీసులు సూచించారు.














