ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో చిత్రంలోని ‘అప్పుడే పెళ్లా’ అనే లిరికల్ వీడియోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ పాటకు వరికుప్పల యాదగిరి సాహిత్యం అందించడంతో పాటు సంగీతం సమకూర్చారు. సాహితి చాగంటి ఈ పాటను ఆలపించారు. లిరికల్ వీడియో విడుదల సందర్భంగా చిత్రబృందం సినిమా విశేషాలను మీడియాతో పంచుకుంది.
ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ ‘ఐ హేట్ మ్యారేజ్’ సినిమాను తాను ఇప్పటికే చూశానని, సినిమా తనకు బాగా నచ్చిందని తెలిపారు. చిత్రాన్ని తెరకెక్కించిన విధానం కూడా ఆకట్టుకుందని అన్నారు. దర్శకుడు పరమేష్ రేణుకుంట్లను తమ స్నేహితుడిగా భావించిన చిన్ననాటి మిత్రులంతా కలిసి ఈ సినిమాను నిర్మించడం అభినందనీయమని చెప్పారు. సినిమాలో కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా మంచి కంటెంట్, ఎమోషన్ కూడా ఉన్నాయని బెక్కెం వేణుగోపాల్ పేర్కొన్నారు. అందమైన ప్రేమకథతో పాటు యువతకు ఉపయోగపడే సందేశం కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల మాట్లాడుతూ ఎన్నో కష్టాలు, స్ట్రగుల్స్ మధ్య ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. తనపై నమ్మకంతో తన స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మించారని చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత జెన్ జీ యువతకు కనెక్ట్ అయ్యే విధంగా కథను రూపొందించినట్లు వివరించారు. సినిమాలో హీరో, హీరోయిన్ పాత్రలను చూసినప్పుడు యువత తమను తాము తెరపై చూసుకున్న అనుభూతి కలుగుతుందని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే కొంతమంది యువతకు ప్రత్యేకంగా సినిమా చూపించామని, వారు చాలా క్రేజీగా నచ్చిందని చెప్పడంతో సినిమాపై తన నమ్మకం మరింత పెరిగిందని అన్నారు.
హీరోయిన్ జుప్పీ భద్ర మాట్లాడుతూ తాను పెళ్లికూతురు గెటప్‌లో కార్యక్రమానికి ఎందుకు వచ్చానో సినిమా చూస్తే అర్థమవుతుందని ఆసక్తికరంగా చెప్పారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి, నిర్మాతలు దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి, రచయిత ఘటిక చలం, ఎడిటర్ ఆవుల వెంకటేష్, అడ్వకేట్ వీణ, కో-ప్రొడ్యూసర్ కాశీ తదితరులు పాల్గొన్నారు.
సుగి విజయ్, జుప్పీ భద్ర, హారిక రాజేందర్, సాహితి కృష్ణ, పృథ్వీరాజ్, రవివర్మ అద్దూరి, ఆశ్రిత వేముగంటి, ప్రభావతి, జాకీర్, శ్రీదేవి ఆరోజు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం పరమేష్ రేణుకుంట్ల అందించారు. విజయ్ సి. కుమార్ ఛాయాగ్రహణం నిర్వహించగా, వరికుప్పల యాదగిరి సంగీతం అందించారు. ఆవుల వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఆర్య సినిమా బ్యానర్‌పై దయానంద్ మాదం, కార్తీక్ వెంపటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రేమ, పెళ్లి, యువత ఆలోచనా విధానాల చుట్టూ సాగే కథతో రూపొందిన ‘ఐ హేట్ మ్యారేజ్’ అక్టోబర్ చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. విడుదలకు ముందే లిరికల్ వీడియోతో సందడి మొదలుపెట్టిన ఈ చిత్రం యూత్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.













