హైదరాబాద్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్‌లలో స్థానికులు తక్కువగా ఉన్నందున మిగిలిన ఇళ్లకు మరోసారి లాటరీ నిర్వహించనున్నారు. ఎంపిక కాని దరఖాస్తుదారులకు వారు చెల్లించిన రూ.10,000 త్వరలోనే రిఫండ్ కానున్నాయి. దరఖాస్తులో నియోజకవర్గ తప్పులున్న వారు ఈ నెల 25 వరకు ఆన్‌లైన్‌లో సవరించుకోవచ్చు. ఎంపికైన లబ్ధిదారులకు వాట్సాప్, ఎస్‌ఎంఎస్ ద్వారా అలాట్‌మెంట్ లెటర్లు పంపుతారు.
శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. వీరిని అరెస్టు చేయొద్దని గతంలో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వగా, ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణలో పీపీ నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్‌ను వీరు అసభ్య పదజాలంతో దూషించారని, విధుల్లో ఉన్న పోలీసులపై దాడి చేశారని తెలిపారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని ఎమ్మెల్సీలను ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
జూరాల ప్రాజెక్ట్ నీటి సమస్యపై తెలంగాణ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదారి పట్టిస్తోందని ఆయన ఆరోపించారు. కోవిడ్-19, ఎల్ నినో కంటే ఈ ప్రభుత్వమే చాలా ప్రమాదకరంగా మారిందని మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల కృష్ణా నదిలో 250 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నా, సర్కార్ కేవలం 28 టీఎంసీలు మాత్రమే వాడుకుందని తెలిపారు. మిగతా నీరంతా సముద్రంలోకి, ఆంధ్రప్రదేశ్‌కు వృథాగా వెళ్లిపోయిందని, ఒక్క ఏపీకే 100 టీఎంసీలకు పైగా తరలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుప్పం నియోజకవర్గ ప్రజలతో తనది కుటుంబ అనుబంధమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంట్లో తనను కుటుంబసభ్యుడిలా చూస్తారని చెప్పారు. కుప్పం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ‘స్వర్ణ కుప్పం’ సభలో మాట్లాడుతూ, నారావారిపల్లె జన్మనిస్తే కుప్పం తనకు రాజకీయ జన్మనిచ్చిందని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇల్లు, అన్ని గ్రామాల్లో వసతులు కల్పించడమే ‘స్వర్ణ కుప్పం’ లక్ష్యమని తెలిపారు. అలాగే రూ.2.5 కోట్ల వ్యయంతో మార్కెట్‌యార్డును అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు.
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఎఫ్.కె.పాలెంలో మైసమ్మ చెరువును పరిశీలించి, అక్కడ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం పిఠాపురంలో నగరవనాన్ని ప్రారంభించి స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత మైసమ్మ చెరువు నుంచి ప్రధాన కూడలి వరకు నడిచి వెళ్లారు. మార్గమధ్యలో ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ చిన్నారులతో ఫొటోలు దిగారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 24 గంటల్లో వాయుగుండంగా మారి తీవ్రరూపం దాల్చనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తీవ్ర వాయుగుండం సెప్టెంబర్ 23 ఉదయానికి ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాలకు సమీపానికి చేరుకోనుంది. ఈ క్రమంలో కోస్తాంధ్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది.
శబరిమల అయ్యప్ప ఆలయంలో ప్రసాదం కొరతపై కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మధ్య వివాదం ముదిరింది. భక్తులకు సరిపడా ప్రసాదం అందుబాటులో లేకపోవడంపై మంత్రి మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ లోపమే దీనికి కారణమని, బాధ్యులపై చర్యల కోసం హైకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. కౌంటర్ల వద్ద పంపిణీని పరిమితం చేసి మధ్యాహ్నం వేళ మూసివేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే భక్తుల సంఖ్య ఊహించని విధంగా పెరగడం వల్లే ఈ సమస్య వచ్చిందని దేవస్థానం బోర్డు వివరణ ఇచ్చింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరాయి. తమపై దాడులు చేస్తే పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలపై కొత్త ఆయుధాలతో తీవ్ర ప్రతిదాడి చేస్తామని ఇరాన్ ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అమెరికా సైనిక చర్యకు సన్నాహాలు చేస్తోందని ‘ఖతం అల్-అన్బియా’ ఆరోపించింది. మరోవైపు, ఇరాన్‌తో ఘర్షణల వల్ల అమెరికాలో 22 బిలియన్ డాలర్ల ఆయుధాల కొరత ఏర్పడిందని పెంటగాన్ నివేదిక తెలపగా, ఆ వార్తలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది.
ప్రముఖ సీనియర్ నటి రాధ తన సోదరి అంబికపై సంచలన ఆరోపణలు చేశారు. తన గదిలోని సంతకం చేసిన ఖాళీ చెక్కులను దొంగిలించి, రూ.50 కోట్లు కాజేసేందుకు అంబిక, సోదరుడు మల్లికార్జున్ యత్నించారని ఆమె చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యాపార, సిబ్బంది జీతాల అవసరాల కోసం ఈ చెక్కులను తాను గదిలో ఉంచినట్లు తెలిపారు. అదే ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న అంబిక, తన అనుమతి లేకుండా గదిలోకి వెళ్లి వాటిని తీసుకున్నారని రాధ ఆరోపించారు.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి సీబీఎఫ్‌సీ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో బోర్డు 21 మార్పులను సూచించింది. ఈ సినిమా నిడివి 2 గంటల 54 నిమిషాల 4 సెకన్లుగా ఉంది. ‘ఏ’ సర్టిఫికెట్ వల్ల కుటుంబ ప్రేక్షకులు రాలేకపోయినా, నటుడిగా అన్ని జానర్లు ప్రయత్నించాలని నాని తెలిపారు. త్వరలోనే తన నుంచి మళ్లీ కుటుంబ కథా చిత్రాలు వస్తాయని ఆయన చెప్పారు.













